కేసీఆర్‌ని విమర్శిస్తే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: ‘‘లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రాజధానికి కట్టుకుంటామంటున్నారు. మీ పిల్లలకు మీరు ఫీజులు కట్టుకోలేరా? దీనిపై మా కేసీఆర్‌ను తిట్టడం ఏమిటి.. ఇది అన్యాయం. దీన్ని మేము సీరియస్‌గా ఖండిస్తున్నాం. మంత్రులారా.. మీ ప్రజల బాగోగులు మీరు చూసుకోండి. మా ప్రజల బాగు మేము చూసుకుంటాం. మీరు మీ చేతగాని తనాన్ని, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం, ఊరుకోం..’’ అని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సీమాంధ్ర మంత్రులను హెచ్చరించారు. తెలంగాణ పిల్లలకు అక్కడి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తామని చెపుతుంటే, మీరేందుకు మా పిల్లల ఫీజులు కట్టరని సీమాంధ్ర ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని..దీనికి సమాధానం చెప్పుకోలేకే అక్కడి మంత్రులు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానికత విషయంలో 1956ను ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తామని తమ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే, చట్టాలను, రాజ్యాంగాన్ని కేసీఆర్ ఉల్లంఘిస్తున్నారని అక్కడి మంత్రులు విమర్శించడం సరి కాదన్నారు. తెలంగాణ పిల్లలేవరో తేల్చుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందని ఉద్ఘాటించారు. కాగా బస్సులపై రాళ్లు వేయడంతోనే ఉస్మానియా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని నాయిని పేర్కొన్నారు.