
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి కొత్త చైర్మన్‌గా నేతి విద్యాసాగర్ నియమితులు కానున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. మండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ప్రస్తుతం మండలి వైస్‌చైర్మన్‌గా ఉన్న విద్యాసాగర్ శనివారం నుంచి తాత్కాలికంగా పూర్తిస్థాయి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. శాసనమండలి చైర్మన్ ఎన్నికపై త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈసారి విద్యాసాగర్‌కు అవకాశం ఇవ్వా లని టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. మున్నూరు కాపు సామాజికవర్గానికి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. దీంతో ఈ వర్గానికి చెం దిన నేతి విద్యాసాగర్‌కు శాసనమండలి చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే అసెంబ్లీ సమావేశాల వరకు మండలి చైర్మన్, మండలి చీఫ్ విప్, అసెంబ్లీ చీఫ్ విప్, విప్ పదవులను భర్తీ చేసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఈ పదవులపై స్పష్టత రానుంది. శాసనమండలి ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో శనివారం నుంచి కొత్త సభ్యుల పదవీకాలం మొదలు కానుంది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు స్థానాలకు, స్థానిక సంస్థల కోటాలో ఒక స్థానానికి, ఉపాధ్యా యుల కోటాలో రెండు స్థానాలకు, పట్టభద్రుల కోటాలో ఒక స్థానానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్యే కోటాలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ ఎమ్మెల్సీలుగా గెలి చారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం లో ఎం.ఎస్.ప్రభాకర్‌రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా టి.జీవన్‌రెడ్డి గెలిచారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి.. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా కూర రఘోత్తమ్‌రెడ్డి గెలిచారు. వీరి ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మార్చి 30 నుంచి వీరి పదవీకాలం మొదలవుతుంది. మహమూద్‌అలీ, ఎం.ఎస్.ప్రభాకర్‌రావులు ఎమ్మెల్సీలుగా ఉన్నవారే. మిగిలిన వారంతా కొత్త వారు.
కాంగ్రెస్‌కు ఒక్కరే..
స్వామిగౌడ్‌తోపాటు, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహమ్మద్ సలీం, టి.సంతోష్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి, పూల రవీందర్ పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. మండలిలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన పాతూరి సుధాకర్‌రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. తాజా ఎన్నికల అనంతరం మండలిలో కాంగ్రెస్ సభ్యుల బలం ఒక్కరికే పరిమితం కానుంది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తాజాగా కాంగ్రెస్ తరఫున జీవన్‌రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment