
శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న లక్ష్మణ్, రాజాసింగ్, దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ‘నేను 15 ఏళ్లు సీఎంగా ఉన్నాను. సచివాలయానికి వెళ్లని ఇలాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకూ చూడలేదు. ప్రజాసమస్యలు పట్టించుకోవడం లేదు’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ సభ్యత్వ ప్రముఖ్ శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసేందుకు ఆయన రాష్ట్రానికి వచ్చారు. బుధవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో మాట్లాడారు.
అంతకంటే ముందు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెక్రటేరియట్‌కే వెళ్లని సీఎంకు కొత్త సెక్రటేరియట్, కొత్త అసెంబ్లీ కావాలట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. ప్రజల సంక్షేమంపై దృష్టి ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. అంతా టీంగా పనిచేద్దామని ప్రధాని నరేంద్రమోదీ నీతి ఆయోగ్ సమావేశం పెడితే, ఎంతో ముఖ్యమైన ఆ భేటీకి సీఎం కేసీఆర్ హాజరుకాలేదన్నారు. తెలంగాణలో కుటుంబపాలనకు ప్రజలు స్వస్తి పలుకుతున్నారని, అందులో భాగంగానే నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపించారన్నారు. తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7 శాతం ఓట్లు, ఒక సీటు వస్తే, పార్లమెంట్ ఎన్నికల్లో 20 శాతం ఓట్లతో నాలుగుసీట్లు వచ్చాయన్నారు.
జూలై 6 నుంచి సభ్యత్వ నమోదు..
జూలై 6వ తేదీన జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జన్మదినాన్ని పురస్కరించుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆగస్టు 11వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో 8 వేల శక్తి కేంద్రాల్లో 8 వేల మంది విస్తారక్‌కులు వారం రోజులపాటు పనిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు అందరినీ కలుస్తామని, పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. సమావేశానికి అ«ధ్యక్షత వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తెచ్చిన పథకాలను మధ్యప్రదేశ్‌లో ఎప్పుడో అమలు చేశారన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్ర మాజీమంత్రి బండారు దత్రాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment