
పెళ్లయిన ఐదు రోజులకే పాడె కట్టిండు
రోకలితో తలపై కొట్టి పరారైన భర్త...
ఖిల్లాఘనపురం: కాళ్ల పారాణి ఆరనేలేదు.. ఇంటి ముందు పెళ్లిపందిరి తీయకముందే అత్తారింటికి కాపురానికి వచ్చిన ఓ నవ వధువు కట్టుకున్నవాడి చేతిలో బలైంది. కడ దాకా తోడుంటానని పంచభూతాల సాక్షిగా ఐదురోజుల క్రితమే పెళ్లాడిన భార్యను భర్త రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ సంఘ టన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురంలో ఆది వారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాగనమోని బాలయ్య, సత్యమ్మల పెద్ద కుమారుడు రాగనమోని ఆంజ నేయులుకు పెద్దమందడికి చెందిన ఆరెపల్లి గొల్ల వెంకటయ్య కూతురు పారిజాత అలియాస్ నీలవతి (18)తో ఈ నెల 12న వివాహం జరిగింది.
భర్తతో కాపురం చేసేందుకు పారిజాత ఘనపురం వచ్చింది. ఆదివారం రాత్రి భోజనం చేస్తున్న సమ యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆంజనేయులు గదిలో ఉన్న రోకలిబండతో భార్య తలపై మోదాడు. పారిజాత తలకు తీవ్ర గాయమై రక్త స్రావం కావడంతో తేరుకున్న భర్త తాను చనిపోతానని, ఈ బతుకువద్దంటూ ఇంటి వెనక గోడ దూకి పక్కనే ఉన్న గుట్టల్లోకి వెళ్లాడు.
రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొన ఊపిరితో ఉన్న పారిజాతను అత్తమామలు గమనించి చుట్టు పక్కల వారి సహాయంతో మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. మృతురాలి తండ్రి ఆరెపల్లి గొల్ల వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట సీఐ శ్రీనివాసులు తెలిపారు. అడిగిన వెంటనే అన్నం పెట్టలేదనే కోపంతో తన కూతురిని కొట్టి చంపాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు.