రెండో చాసెస్‌తో రిజిస్టర్ చేయాల్సిందే..
♦ రవాణా శాఖ అధికారులకు తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కారురోడ్డు ప్రమాదంలో చాసెస్ పూర్తిగా దెబ్బతిని, కొత్త చాసెస్ బిగించిన సందర్భంలో కారులో మార్పులు చేశారన్న కారణంతో ఆ వాహనాన్ని రిజిస్టర్ చేయబోమని చెప్పడానికి వీల్లేదని రవాణా శాఖ అధికారులకు హైకోర్టు తేల్చి చెప్పింది.
మోటారు వాహన చట్టంలోని సెక్షన్–52కు సవరణలు తీసు కొచ్చారని, దీని ప్రకారం దెబ్బతిన్న చాసెస్ స్థానంలో కొత్త చాసెస్ బిగించి ఆ విషయాన్ని వాహన యజమానికి తెలియచేసినప్పుడు ఆ వాహనాన్ని రిజిస్టర్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ రజనీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఇదే అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది.
ఇదీ నేపథ్యం
2007లో టయోటా కారు కొన్న 2 నెలలకు రోడ్డు ప్రమాదంలో చాసె స్ పూర్తిగా దెబ్బతింది. కారును పరిశీలించిన టయోటా కంపెనీ మరో నంబర్‌తో కొత్త చాసెస్ ఇచ్చింది. రెండో చాసెస్ నంబర్ ఆధారంగా రిజిస్ట్రే షన్ చేసేందుకు ఆర్టీఏ అధికారులు నిరాకరించారు. రవా ణా చట్టంలోని సెక్షన్–52 ప్రకారం చాసెస్ మారిస్తే రిజి స్ట్రేషన్‌కు వీల్లేదన్న ఆర్టీఏ వాదనను 2008లో సింగిల్ జడ్జి తోసిపుచ్చారు. దీనిపై రవాణా అధికారులు అప్పీల్ చేశారు. అన్ని అర్హతలున్న కంపెనీ కాబట్టి కొత్త చాసెస్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని ధర్మాసనం తెలిపింది.