
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగిన మధిర గ్రామాల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం సూచించిన ప్రకారం తీరొక్క రకంగా వివరాలు సేకరించారు. జిల్లాలోని 14 పూర్వ మండలాలతో పాటు జనగామ జిల్లాలోని గుండాల మండలం నుంచి 95 గ్రామాలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా మండలాలకు చెందిన ఎంపీడీఓలు రూపొందించిన జాబితా ప్రకారం ఇవి పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అర్హత కలిగి ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 115 గ్రామాల నుంచి నూతన పంచాయతీల కోసం ప్రజ ల నుంచి లిఖిత పూర్వక దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని 15 మండలాల్లో ప్రస్తుతం 334 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 784 మధిర గ్రామాలు ఉన్నాయి. వీటిలో 500 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు 371 ఉండగా, 500 కంటే తక్కువ జనాభా కలిగినవి 413 ఉన్నాయి. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారుల లెక్కల్లో 81 గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి అర్హత కలిగినట్టు నిర్ధారించి నివేదికను పంపారు.
అధికారులు సేకరించిన వివరాలు ఏ ప్రాతిపదికనంటే..
500మంది కంటే ఎక్కువ, రెండు కిలో మీటర్లకు పైన దూరం ఉన్న మధిర గ్రామాలు 18
600 మంది కంటే ఎక్కువ జనాభా రెండు కిలోమీటర్ల పైన గ్రామాలు 8
750 మందికి మించి రెండు కిలోమీటర్ల పైన దూరం ఉన్న గ్రామాలు 8
1.000 కంటే ఎక్కువ జనాభా, రెండు కిలోమీటర్ల పైన దూరం ఉన్నవి 4
మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం, 500లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 68
నాలుగు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 500 లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 22
ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం 500లోపు జనాభా ఉన్న మధిర గ్రామాలు 37
కొత్త పంచాయతీలపై ఆశలు..
ప్రజల డిమాండ్‌లకు అనుగుణంగా కొత్త గ్రామ పం చాయతీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు అర్హత కలిగిన మదిర గ్రామాల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. రిజన తండాలు, మధిర గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా చేసే విధంగా కార్యాచరణ చేపట్టామని మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభలో ప్రకటించడంతో అర్హత కలిగిన గ్రామాల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానానికి అనుగుణంగా నూతన పంచాయతీలు ఏర్పాటు చేసి కచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఆయా గ్రామల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment