అమ్మవారి ఆలయానికి అడ్డంకులే లేవిక | New Road Proposal Approved For Basara Temple | Sakshi
Sakshi News home page

అమ్మవారి ఆలయానికి అడ్డంకులే లేవిక

Published Mon, Nov 12 2018 6:15 PM | Last Updated on Mon, Nov 12 2018 6:54 PM

New Road Proposal Approved For Basara Temple - Sakshi

భైంసా(ముథోల్‌): చదువుల తల్లి సరస్వతీ క్షేత్రానికి మహారాష్ట్ర నుంచి భక్తులు అధికంగా వస్తారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న బాసరలో కొలువైన అమ్మవారిని దర్శించుకునేందుకు రైలుమార్గం ద్వారా చేరుకుంటున్నారు. అయితే మహారాష్ట్ర నుంచి నేరుగా బాసర వచ్చేలా రోడ్డు నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి గతంలోనే సూచించింది. తాజాగా ఈ ప్రతిపాదనను మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.

మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ భాస్కర్‌రావుపాటిల్‌ ఖథ్‌గాంకర్‌ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నితిన్‌గడ్కరి సైతం మహారాష్ట్రవాసి కావడంతో ఈ రోడ్డు నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. కొత్త మార్గం 100 కిలోమీటర్ల రహదారిని రూ.50 కోట్లతో నిర్మించనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌ నుంచి బాసర వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగనుంది.  

రాకపోకలకు ఇబ్బందులు... 
ప్రస్తుతం మహారాష్ట్రవాసులకు బాసర రావడానికి రోడ్డు మార్గం గుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాందేడ్‌ నుంచి నర్సి, నయాగావ్, బిలోలి, కొండల్‌వాడి, ధర్మాబాద్‌ మీదుగా మన ప్రాంతంలోని బిద్రెల్లిగుండా బాసరకు రావాల్సి వస్తుంది. ఇలా బాసర క్షేత్రం చేరుకోవాలంటే నాందేడ్‌ నుంచి బాసర వరకు 130 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇక నాందేడ్‌ నుంచి భైంసా మీదుగా రావాలంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్లుగా ఈ రోడ్డు నిర్మాణంలోనే ఉంది. కార్లు, ఇన్నోవాలు మోకాళ్లలోతు గుంతలో పడి మరమ్మతు చేయించలేక ఈ మార్గాన్ని మరిచిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రవాసులు బాసరకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాందేడ్‌ నుంచి భైంసా మీదుగా బాసర వెళ్లాలన్న 120 కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా నాందేడ్‌ నుంచి నేరుగా కొత్తగా ప్రతిపాదనలు చేసిన రోడ్డుతో 100 కిలోమీటర్లు ప్రయాణించి అమ్మవారి క్షేత్రానికి చేరుకోవచ్చు.
 
రూ.50 కోట్లతో... 
రూ.50 కోట్లతో సీఆర్‌ఎఫ్‌ నిధుల కింద ఈ రోడ్డును పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ అందింది. బాసర మీదుగా మహారాష్ట్రలోని నయాగావ్, బెల్లూర్, సిరస్‌కోట్‌పాట,  జబ్బల్‌పూర్, చిం చోలి, బెల్లూర్‌పాట, బాలాపూర్‌పాట, రాంపూర్, ధర్మాబాద్, రత్నాలి, అత్కూర్‌పాట, బాబ్లీపాట, మంగ్నాలి, పాటోద, రోశన్‌గావ్, చిక్నాపాట, సా యిఖేడ్, బోల్సాపాట, బేల్‌గుజిరి, హరేగావ్, పిప్పల్‌గావ్, కారేగావ్‌పాట, కావల్‌గూడ, శింగాన్‌ పూర్, హర్స, బీజేగావ్, తొండాల, మహాటీ, ఖండ్‌ గావ్, హత్నిపాట, బాలేగావ్‌పాట, బాలేగావ్, ఇజ్జత్‌గావ్, మనూర్, బాయేగావ్, బోల్సాపాట, హంగిర్గ, టాక్లి, దారేగావ్‌తాండపాట, దారేగావ్, మాల్‌కౌట, పిప్పల్‌గావ్, శికాలతండా, అమ్‌దూ ర, మోగడ్, గాతసాహెబ్, శంకతీర్త్‌గాడేగావ్, మాల్‌టేక్డి, నాందేడ్‌ వరకు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.  

ఇదివరకే సర్వే... 
నాందేడ్‌ ఎంపీగా పనిచేస్తున్న సమయంలోనే భాస్కర్‌రావుపాటిల్‌ ఖథ్‌గావ్‌కర్‌ పలుమార్లు బాసర సరస్వతీ అమ్మవారి దర్శనానికి వచ్చారు. దర్శనం చేసుకున్నాక తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ గ్రామాలగుండా రోడ్డు నిర్మించాలన్న ఆలోచనకు వచ్చారు. అప్పట్లోనే మహారాష్ట్ర ప్రాంతంలోని ఇంజినీర్ల బృందంతో సర్వేలు సైతం చేయించారు. ఈ గ్రామాలగుండా ప్రస్తుతం రోడ్డు ఉంది.పూర్తిస్థాయి రోడ్లు, కల్వర్టులు నిర్మించి అందరికి రాకపోకలకు ఉపయోగపడేలా నవీకరించాలని చాలా మార్లు సూచించారు. బీజేపీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న మాజీ ఎంపీ భాస్కర్‌రావుపాటిల్‌ ఖథ్‌గావ్‌కర్‌ ఈ రోడ్డు నిర్మాణం చేపడుతామని చెబుతున్నారు.

కేంద్రం ఈ నిధులు ఇస్తుందని త్వరలోనే రోడ్డు పూర్తవుతుందని అంటున్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే నాందేడ్‌ జిల్లాలోని నాందేడ్, ముథ్‌కేడ్, బిలోలి, నయాగావ్, ధర్మాబాద్, భోకర్‌ నియోజవకర్గాల పరిధిలోని గ్రామాలవాసులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఎంతో మందికి ఉపయోగపడే ఈ రోడ్డు నిర్మాణం జరిగితే బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరగనుంది.  

మరింత తాకిడి... 
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం మీదుగా ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే భక్తుల తాకిడి పెరుగనుంది. ఇప్పటికే బాసర మీదుగా బోదన్, నర్సాపూర్, హైదరాబాద్‌ వరకు జాతీయ రహాదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇదే సమయంలో మహారాష్ట్ర వైపు నుంచి సైతం మరో రహదారి నిర్మాణానికి కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఎన్నో గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు బాసర వరకు వచ్చే వీలున్న కారణంతో ఈ రోడ్డు నిర్మాణం త్వరలోనే జరుగనుంది. పైగా మహారాష్ట్రలోనూ కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ రోడ్డు నిర్మాణం ఇక త్వరలోనే పూర్తవుతుందని ఈ ప్రాంతవాసులు సైతం ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement