
భర్త మందలించాడని యాసిడ్ తాగిన భార్య
సరూర్‌నగర్ (రంగారెడ్డి) : ఎక్కువసేపు సెల్‌లో మాట్లాడొద్దంటూ భర్త మందలించడంతో మనస్తాపం చెందిన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన ప్రభావతికి, రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట నగర పంచాయితీ పరిధిలోని గుర్రంగూడకు చెందిన పుట్టగళ్ల జనార్థన్‌కు రెండు నెలల కిందట వివాహం జరిగింది. అయితే ప్రభావతి పదే పదే ఫోన్ మాట్లాడుతుందని భర్త ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు.
కాగా మూడు రోజుల కిందట ప్రభావతి తల్లిదండ్రులు గుర్రంగూడకు వచ్చారు. వారి ముందు కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. ఆవేశానికి లోనైన ప్రభావతి.. తల్లిదండ్రుల ముందే మరుగుదొడ్లు శుభ్రపరిచే యాసిడ్‌ను తాగింది. వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.