సాక్షి, హైదరాబాద్: తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. తుంగభద్ర నదీజలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్న వాస్తవ నీటివాటా వినియోగంలో ఏర్పడుతున్న లోటు ను పూడ్చడం దీని ఉద్దేశం. ఈ పథకం టెండర్ల ప్రక్రియ ముగిసిన దృష్ట్యా, జనవరి 4న నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక వేశారు. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటివాటా ఉన్నా 4 టీఎంసీలకు మించి వాడటం లేదు.
మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరందాల్సి ఉన్నా 30 వేల ఎకరాలకు కూడా అందడం లేదు. ఈ దృష్ట్యానే 55,600 ఎకరాలకు సాగునీరు, దారిలోని గ్రామాలకు తాగునీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తుంగభద్రపై ఉన్న సుంకేశుల రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ ఫోర్‌షోర్‌లో తుమ్మిళ్ల పథకాన్ని చేపట్టాలని నిర్ణయించి రూ.783 కోట్లకు అనుమతులు ఇచ్చింది.
సుంకేశుల బ్యాక్‌వాటర్‌ను తుమ్మిళ్ల వద్ద నుంచి పైప్‌లైన్‌ల ద్వారా ఆర్డీఎస్ కాల్వలకు మళ్లించి, అటు నుంచి మల్లమ్మకుంట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, అక్కడి నుంచి మరో 3 చిన్నపాటి రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ ఆయ కట్టు వరకు నీటిని తరలించేలా ప్రణాళిక రచించారు. ఫేజ్–1లో భాగంగా తుంగభద్ర నదీజలాలను తీసుకునేలా అప్రోచ్ చానల్, పంప్‌హౌస్, పైప్‌లైన్ల నిర్మాణానికి రూ.383 కోట్లతో అనుమతి ఇచ్చారు. ఇందిరాసాగర్ దుమ్ముగూడెంలో వృథాగా ఉన్న పంపులు, పైపులను తుమ్మిళ్ల పథకానికి ఉపయోగించాలని నిర్ణయించడంతో రూ.162 కోట్ల తో టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పూర్తవడంతోపాటు మట్టిపనులను ఇప్పటికే మొదలు పెట్టారు. అధికారికంగా ఈ పనులను జనవరి 4న హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు.
తుంగభద్ర నీళ్లివ్వండి...
ఏడు వేల ఎకరాల ఆర్డీఎస్ ఆయకట్టుకు వీలుగా తుంగభద్ర నీటిని విడుదల చేయాలని శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ కర్ణాటకను కోరింది. ఈ మేరకు ఈఎన్‌సీ మురళీధర్ తుంగభద్ర బోర్డు ఎస్‌ఈకి లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment