సాక్షి, హైదరాబాద్: వైద్యుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ (సీజీపీ) నూతన కోర్సులను ప్రవేశ పెట్టింది. ఈ కోర్సుల వివరాలను సీజీపీ డీన్ పి.పుల్లారావు బుధవారమిక్కడ వెల్లడించారు. ఫెలోషిప్ ఇన్ డయాబెటాలజీ, ప్రివెంటివ్ కార్డియాలజీ, అల్ట్రాసోనోగ్రాఫి, పీజీ డిప్లొమా ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్(పీజీడీఇఎం), డిప్లొమా ఇన్ ఫ్యామిలీ మెడిసిన్(డీఎఫ్‌ఎం), మెంబర్ ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్(ఎంఆర్‌సీజీపీ), ఇంటర్నేషనల్ పీజీ పిడియాట్రిక్ కోర్సు, ఫెలోషిప్ ఇన్ క్లినికల్ సైకియాట్రీ, డెర్మటాలజీ, ఇన్‌ఫెర్టిలిటీ కోర్సులను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కోర్సుల్లో సంవత్సరం పాటు వైద్యులకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఎంబీబీఎస్, మెడికల్ కౌన్సిల్ రిజిస్రే్టషన్ కలిగిన వైద్యులు ఈ కోర్సులకు అర్హులని తెలిపారు. వీటిలో చేరాలనుకునేవారు జూన్ 30వ తేదీలోపు కోఠిలోని ఐఎంఏ కార్యాలయంలో గాని, 9848034519, 040-24657107 నంబర్‌లలోకాని సంప్రదించాలని కోరారు.