
చర్యలూ నకిలీయేనా?
నకిలీ మిరప విత్తనాల ఘటనలో ప్రభుత్వ నిర్లిప్తత
► బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత
►లైసెన్సుల రద్దుపై కోర్టులో స్టే పొందిన కొందరు డీలర్లు
►చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు!
►కోర్టుకు సరైన రుజువులు, ఆధారాలు చూపలేదనే ఆరోపణలు
►రైతులకు పరిహారంపై ఊసే లేని వైనం
►శాస్త్రవేత్తల బృందం సిఫార్సులు చెత్తబుట్ట పాలు
►ఉన్నపళంగా సస్పెన్షన్ ఎత్తివేతపై సందేహాలు
►ఆవేదనలో బాధిత రైతులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాల వ్యవహారంలో చర్యలు నీరుగారిపోతు న్నాయి.. వేలాది మంది రైతులకు ఆవేదన మిగిల్చిన ఈ ఘటనలో సూత్రధారులు, బాధ్యులు చల్లగా తప్పించుకుంటున్నారు.. నకిలీ విత్తనాలను అరికట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఇప్పటికే సస్పెండైన అధికారులపై ప్రభుత్వం కరుణ చూపింది. వారిపై సస్పెన్షన్ ను ఎత్తివేసింది. మరోవైపు నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను నిలువునా ముంచిన డీలర్లు తమ లైసెన్సుల రద్దుపై కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుం టున్నారు. తిరిగి దుకాణాలు తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కోర్టుకు పూర్తిస్థాయిలో రుజువులు సమర్పించక పోవడం, గట్టి వాదనలు వినిపించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా రైతులు మాత్రం బలి పశువులు అవుతున్నారు.
వేల మంది రైతులకు నష్టం
గతేడాది ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని రైతులు వివిధ కంపెనీల మిరప విత్తనాలు కొని పంటలు వేశారు. కానీ నకిలీ విత్తనాల కారణంగా 4,420 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 3,531 మంది రైతులు నష్టపోయారని తేల్చారు. వారికి 135 మంది డీలర్లు నకిలీ విత్తనాలను అంటగట్టారు. దీనిపై రైతులు ఆందోళనలు చేయడం, పత్రికల్లో కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. శాస్త్రవేత్తలు, అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. వారు ఆయా జిల్లాల్లో పర్యటించి, పంటలను పరిశీలించారు. రైతులను కలిసి వివరాలు సేకరించారు.
అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు, ప్రాసెసింగ్ కేంద్రాలు, గోదాములను తనిఖీ చేసి.. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయినట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం ప్రధాన కంపెనీల లైసెన్సులను రద్దు చేసింది, అటు జిల్లాల్లో వ్యవసాయాధికారులు ఆయా విత్తన డీలర్ల లైసెన్సులు రద్దు చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసేలా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు మండల స్థాయి వ్యవసాయాధికారులను సస్పెండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది.
వారు బాధ్యులు కాదా?
తాజాగా ఆ వ్యవసాయాధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. సాధారణ విషయాలకే సస్పెన్షన్ విధించి ఏళ్ల తరబడి తిప్పే ప్రభుత్వం... వీరిపై ఉన్నపళంగా సస్పెన్షన్ ను ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చింది?, వారు నకిలీ విత్తనాల విషయంలో బాధ్యులు కాదని నిర్ధారించారా? మరి బాధ్యులెవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి నకిలీ మిరప విత్తనాల వ్యవహారంలో ఇప్పటివరకు ఈ ముగ్గురు మండల వ్యవసాయాధికారులు తప్ప.. పైస్థాయిలో బాధ్యులైన అధికారులపై చర్యలేమీ తీసుకోలేదు. మూడు జిల్లాల పరిధిలో కూడా ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనరేట్‌లో ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై విచారణ కానీ, చర్యలుకానీ లేవు. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి లాభం
నకిలీ మిరప విత్తనాల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లిప్తతను ఆధారం చేసుకుని కొందరు డీలర్లు తమ లైసెన్సులను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ మూడు జిల్లాలకు చెందిన డీలర్లు స్థానిక ప్రజాప్రతినిధులను, మంత్రులను కలసి తమ లైసెన్సులు పునరుద్ధరించాలని విన్నవించుకున్నారు. దీంతో వ్యవసాయశాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలువురు డీలర్లు కోర్టులకు వెళ్లి లైసెన్సుల రద్దుపై స్టేలు తెచ్చుకున్నారు కూడా.
రైతులకు పరిహరమేది?
రైతులు నకిలీ విత్తనాల కారణంగా ఒక్కో ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోయారని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందమే అభిప్రాయపడింది. ఆ మేరకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా సిఫారసు చేసింది. కానీ ఆ సిఫారసులను వ్యవసాయశాఖ చెత్తబుట్ట పాలు చేసింది. నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నయా పైసా అందకపోవడం గమనార్హం. కనీసం కంపెనీల నుంచైనా పరిహారం ఇప్పించేందుకు వ్యవసాయశాఖ ప్రయత్నించలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విత్తన చట్టంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలన్న అంశం లేదని, అందువల్ల రైతులకు ఆర్థిక సాయం చేయడం కుదరదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.