Fake chili seeds
-
చర్యలూ నకిలీయేనా?
నకిలీ మిరప విత్తనాల ఘటనలో ప్రభుత్వ నిర్లిప్తత ► బాధ్యులైన అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత ►లైసెన్సుల రద్దుపై కోర్టులో స్టే పొందిన కొందరు డీలర్లు ►చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు! ►కోర్టుకు సరైన రుజువులు, ఆధారాలు చూపలేదనే ఆరోపణలు ►రైతులకు పరిహారంపై ఊసే లేని వైనం ►శాస్త్రవేత్తల బృందం సిఫార్సులు చెత్తబుట్ట పాలు ►ఉన్నపళంగా సస్పెన్షన్ ఎత్తివేతపై సందేహాలు ►ఆవేదనలో బాధిత రైతులు సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాల వ్యవహారంలో చర్యలు నీరుగారిపోతు న్నాయి.. వేలాది మంది రైతులకు ఆవేదన మిగిల్చిన ఈ ఘటనలో సూత్రధారులు, బాధ్యులు చల్లగా తప్పించుకుంటున్నారు.. నకిలీ విత్తనాలను అరికట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. ఇప్పటికే సస్పెండైన అధికారులపై ప్రభుత్వం కరుణ చూపింది. వారిపై సస్పెన్షన్ ను ఎత్తివేసింది. మరోవైపు నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను నిలువునా ముంచిన డీలర్లు తమ లైసెన్సుల రద్దుపై కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుం టున్నారు. తిరిగి దుకాణాలు తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కోర్టుకు పూర్తిస్థాయిలో రుజువులు సమర్పించక పోవడం, గట్టి వాదనలు వినిపించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా రైతులు మాత్రం బలి పశువులు అవుతున్నారు. వేల మంది రైతులకు నష్టం గతేడాది ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని రైతులు వివిధ కంపెనీల మిరప విత్తనాలు కొని పంటలు వేశారు. కానీ నకిలీ విత్తనాల కారణంగా 4,420 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 3,531 మంది రైతులు నష్టపోయారని తేల్చారు. వారికి 135 మంది డీలర్లు నకిలీ విత్తనాలను అంటగట్టారు. దీనిపై రైతులు ఆందోళనలు చేయడం, పత్రికల్లో కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. శాస్త్రవేత్తలు, అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. వారు ఆయా జిల్లాల్లో పర్యటించి, పంటలను పరిశీలించారు. రైతులను కలిసి వివరాలు సేకరించారు. అనంతరం హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు, ప్రాసెసింగ్ కేంద్రాలు, గోదాములను తనిఖీ చేసి.. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయినట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం ప్రధాన కంపెనీల లైసెన్సులను రద్దు చేసింది, అటు జిల్లాల్లో వ్యవసాయాధికారులు ఆయా విత్తన డీలర్ల లైసెన్సులు రద్దు చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసేలా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు మండల స్థాయి వ్యవసాయాధికారులను సస్పెండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు యూటర్న్ తీసుకుంటోంది. వారు బాధ్యులు కాదా? తాజాగా ఆ వ్యవసాయాధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. సాధారణ విషయాలకే సస్పెన్షన్ విధించి ఏళ్ల తరబడి తిప్పే ప్రభుత్వం... వీరిపై ఉన్నపళంగా సస్పెన్షన్ ను ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చింది?, వారు నకిలీ విత్తనాల విషయంలో బాధ్యులు కాదని నిర్ధారించారా? మరి బాధ్యులెవరు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి నకిలీ మిరప విత్తనాల వ్యవహారంలో ఇప్పటివరకు ఈ ముగ్గురు మండల వ్యవసాయాధికారులు తప్ప.. పైస్థాయిలో బాధ్యులైన అధికారులపై చర్యలేమీ తీసుకోలేదు. మూడు జిల్లాల పరిధిలో కూడా ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనరేట్లో ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై విచారణ కానీ, చర్యలుకానీ లేవు. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వారికి లాభం నకిలీ మిరప విత్తనాల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లిప్తతను ఆధారం చేసుకుని కొందరు డీలర్లు తమ లైసెన్సులను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆ మూడు జిల్లాలకు చెందిన డీలర్లు స్థానిక ప్రజాప్రతినిధులను, మంత్రులను కలసి తమ లైసెన్సులు పునరుద్ధరించాలని విన్నవించుకున్నారు. దీంతో వ్యవసాయశాఖ కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలువురు డీలర్లు కోర్టులకు వెళ్లి లైసెన్సుల రద్దుపై స్టేలు తెచ్చుకున్నారు కూడా. రైతులకు పరిహరమేది? రైతులు నకిలీ విత్తనాల కారణంగా ఒక్కో ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టపోయారని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందమే అభిప్రాయపడింది. ఆ మేరకు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా సిఫారసు చేసింది. కానీ ఆ సిఫారసులను వ్యవసాయశాఖ చెత్తబుట్ట పాలు చేసింది. నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నయా పైసా అందకపోవడం గమనార్హం. కనీసం కంపెనీల నుంచైనా పరిహారం ఇప్పించేందుకు వ్యవసాయశాఖ ప్రయత్నించలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న విత్తన చట్టంలో నకిలీ విత్తనాలతో నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలన్న అంశం లేదని, అందువల్ల రైతులకు ఆర్థిక సాయం చేయడం కుదరదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
‘నకిలీ మిరప’లో అధికారుల పాత్రపై విజిలెన్స
► వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల సహా కమిషనరేట్లో విచారణ ► కంపెనీలకు లెసైన్సులు జారీ చేసిన అధికారులపై ఆరా సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలను రైతులకు అంటగట్టిన కంపెనీలు, డీలర్లపై చర్యలకు దిగిన ప్రభుత్వం... ఇప్పుడు జిల్లాల్లో వ్యవసాయాధికారులు, కమిషన రేట్లోని ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై ఆరా తీస్తోంది. ఈ మేరకు నిఘా విభాగం (విజిలెన్స) విచారణ చేస్తున్నట్లు తెలిసింది. నకిలీ మిరప విత్తనాలను సరఫరా చేశారన్న కారణంతో దాదాపు 110 మంది డీలర్ల లెసై న్సులను వ్యవసాయ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆరుగురిపై పోలీసు లు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. ఆయా కంపెనీల ఫ్యాక్టరీల పరిధిలోని ముగ్గురు వ్యవసాయాధికారులను సస్పెండ్ చేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాలను విక్రయిస్తున్నా ఏమాత్రం పట్టించుకోని వ్యవసాయాధికారుల పాత్రపైనా విజిలెన్స తాజాగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆయా కంపెనీలకు రాష్ట్రస్థాయి లో వ్యవసాయ కమిషనరేట్ స్థారుులో లెసైన్సులు ఎలా జారీచేశారన్న అంశంపైనా నిఘా విభాగం ఆరా తీస్తోంది. వ్యవసాయాధికారులపైనా చర్యలు? ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నకిలీ మిరప విత్తనాలు వేసి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 72 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. నకిలీ మిరప విత్తనాలపై ప్రభుత్వం వ్యవసాయ సైంటిస్టులు, అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు ఆయా జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నకిలీ విత్తనాలతో మిరప రైతులు నష్టపోయారని బృందం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం ఇప్పటివరకు 110 మంది డీలర్ల లెసైన్సులు రద్దు చేసింది. ఆరు కంపెనీ యాజమాన్యాలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసింది. స్థానికంగా ఉన్న మండల వ్యవసాయాధికారులు కొం దరు నకిలీ విత్తనాలు విక్రరుయించే డీలర్ల నుంచి ముడుపులు పుచ్చుకొని చూసీ చూడ నట్లుగా వదిలేశారన్న ఆరోపణలు న్నాయి. అంతేకాదు రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు నకిలీ విత్తన కంపెనీలకు ఎలా లెసైన్సులు జారీచేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. వ్యవసాయశాఖ వైఫల్యం వల్లే నకిలీ మిరప విత్తనాలు రైతుల వద్దకు చేరాయని, దీనికి వ్యవసాయశాఖ బాధ్యత వహించాల్సి ఉం టుందని విజిలెన్స అధికారులు చెబుతు న్నారు. ఈ అంశంలో కొందరు మండల వ్యవ సాయాధికారులపై చర్యలుండే అవకాశం ఉంది. సంబంధిత విత్తన కంపెనీల లెసైన్సు ఫైలు వివిధస్థారుు అధికారుల నుంచి కమిష నరేట్లోని ఇద్దరు ముఖ్యమైన అధికారుల ఆమోదం తర్వాతే జారీ అరుు ఉంటుందని అంటున్నారు. లెసైన్సుల జారీలో ఆ ఇద్దరి పాత్ర ఉంటే వారిపైనా చర్యలుంటాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు. -
నకిలీ చీడపై పీడీ
♦ కేసులు నమోదు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు ♦ ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన సర్కారు సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలు అంటగట్టి రైతుల పొట్టగొట్టిన కంపెనీల ప్రతినిధులు, డీలర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ కంపెనీల ప్రతినిధులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. సీఎస్ ఆదేశాలు అందుకున్న అధికారులు తక్షణమే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎవరిపై కేసులు నమోదు చేశారన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోవడంపై ‘సాక్షి’ ఇటీవల ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ముఖ్యంగా మూడు జిల్లాల్లో డీలర్లు, విత్తన కంపెనీ ప్రతినిధుల అరెస్టులకు రంగం సిద్ధమవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, ఇల్లెందు మండలాలు, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లోని వివిధ మండలాల్లోని రైతులు దాదాపు 14 వేల ఎకరాల్లో నకిలీ మిరప విత్తనాలు వేసి నష్టపోయారు. ఒక అంచనా ప్రకారం నకిలీ మిరప విత్తనాల కారణంగా రైతులు రూ.450 కోట్ల మేరకు నష్టపోయారు. విత్తనాలు నకిలీవేనని వ్యవసాయశాఖ నియమించిన నిజనిర్ధారణ శాస్త్రవేత్తలు, అధికారుల బృందం తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. అయితే నకిలీ విత్తనాలతో నష్టపోయిన 5 వేల మంది రైతులకు పరిహారం ఇచ్చే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన జారీ కాలేదు. -
కన్నీరే మిగిలింది
కేసముద్రం: నకిలీ మిర్చి విత్తనాలు రైతులను నిండా ముంచాయి. వందల ఎకరాల్లో వేసిన పంటలు వారి ఆశలను మట్టిపాలు చేశాయి. మొక్కలకు, కాత, పూత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 950 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. నెల దాటినా మొక్కలో పెరుగుదల, కాత, పూత లేకపోవడంతో వేల రూపాయలు వెచ్చించి మందులు వేశారు. అయినా ఫలితం లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేసిన షాపుల్లో అడిగితే వ్యాపారులు తమకు సంబంధం లేదంటున్నారు. కంపెనీ వారు పంపించినవే తాము విక్రయించామని దాటవేస్తున్నారు. మరికొందరు వ్యాపారులు షాపులకు తాళాలు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. పంట పూర్తిగా దెబ్బతినడంతో వాటిని తొలగించి ప్రత్యామ్నాయ సాగు కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారు. విలువైన సమయంతో పాటు ఎకరాకు రూ.40 వేల చొప్పున నష్టపోయామని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -మొదటిసారి వేసి నష్టపోయిన -ఆగె యాకన్న, కేసముద్రంస్టేషన్ మిర్చిపంట వేస్తే మంచి లాభం ఉంటుందని ఆశపడిన, ఇక్కడ ఉన్న ఎరువుల దుకాణంలో 14 ప్యాకెట్లను రూ.6వేలకు తెచ్చి ఎకరంలో వేసిన. నెలదాటినా మొక్క ఫీటు కూడా పెరగలే. రూ.25వేలు పెట్టి మందులు కొటినా లాభం లేదు, విత్తనాలు అమ్మిన సేటును అడిగితే వచ్చి చూసిపోయిండు కానీ ఏమీ చెప్పలే. రూ.40 వేలు నష్టపోయిన నల్లగొండ శ్రీనివాస్, కేసముద్రంస్టేషన్ ఎకరంన్నర భూమిలో 20 ప్యాకెట్ల మిర్చి విత్తనాలు వేసిన. నెలదాటిన మొక్కలు పెరగలే. దాదాపు రూ.40 వేలు పెట్టి మందులు కొట్టినా.. పంట ఎదగలే. ఎవరికి చెప్పినా పట్టించుకోట్లేదు. షాపు వాళ్లని అడిగితే కంపెనీ వాళ్లు మోసం చేసిండని చెప్తాండ్రు.