♦ కేసులు నమోదు చేయాల్సిందిగా సీఎస్ ఆదేశాలు
♦ ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన సర్కారు
సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలు అంటగట్టి రైతుల పొట్టగొట్టిన కంపెనీల ప్రతినిధులు, డీలర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ కంపెనీల ప్రతినిధులు, డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. సీఎస్ ఆదేశాలు అందుకున్న అధికారులు తక్షణమే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే ఎవరిపై కేసులు నమోదు చేశారన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోవడంపై ‘సాక్షి’ ఇటీవల ప్రత్యేక కథనాలను ప్రచురించింది.
ముఖ్యంగా మూడు జిల్లాల్లో డీలర్లు, విత్తన కంపెనీ ప్రతినిధుల అరెస్టులకు రంగం సిద్ధమవుతోంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, ఇల్లెందు మండలాలు, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లోని వివిధ మండలాల్లోని రైతులు దాదాపు 14 వేల ఎకరాల్లో నకిలీ మిరప విత్తనాలు వేసి నష్టపోయారు. ఒక అంచనా ప్రకారం నకిలీ మిరప విత్తనాల కారణంగా రైతులు రూ.450 కోట్ల మేరకు నష్టపోయారు.
విత్తనాలు నకిలీవేనని వ్యవసాయశాఖ నియమించిన నిజనిర్ధారణ శాస్త్రవేత్తలు, అధికారుల బృందం తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తోంది. అయితే నకిలీ విత్తనాలతో నష్టపోయిన 5 వేల మంది రైతులకు పరిహారం ఇచ్చే విషయంపై మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన జారీ కాలేదు.