కేసముద్రంస్టేషన్‌లో కాతపూత లేని మిర్చి పంట ఇదే
కేసముద్రం: నకిలీ మిర్చి విత్తనాలు రైతులను నిండా ముంచాయి. వందల ఎకరాల్లో వేసిన పంటలు వారి ఆశలను మట్టిపాలు చేశాయి. మొక్కలకు, కాత, పూత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 950 హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. నెల దాటినా మొక్కలో పెరుగుదల, కాత, పూత లేకపోవడంతో వేల రూపాయలు వెచ్చించి మందులు వేశారు. అయినా ఫలితం లేకపోవడంతో విత్తనాలు కొనుగోలు చేసిన షాపుల్లో అడిగితే వ్యాపారులు తమకు సంబంధం లేదంటున్నారు. కంపెనీ వారు పంపించినవే తాము విక్రయించామని దాటవేస్తున్నారు. మరికొందరు వ్యాపారులు షాపులకు తాళాలు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. పంట పూర్తిగా దెబ్బతినడంతో వాటిని తొలగించి ప్రత్యామ్నాయ సాగు కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారు. విలువైన సమయంతో పాటు ఎకరాకు రూ.40 వేల చొప్పున నష్టపోయామని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
-మొదటిసారి వేసి నష్టపోయిన
-ఆగె యాకన్న, కేసముద్రంస్టేషన్
మిర్చిపంట వేస్తే మంచి లాభం ఉంటుందని ఆశపడిన, ఇక్కడ ఉన్న ఎరువుల దుకాణంలో 14 ప్యాకెట్లను రూ.6వేలకు తెచ్చి ఎకరంలో వేసిన. నెలదాటినా మొక్క ఫీటు కూడా పెరగలే. రూ.25వేలు పెట్టి మందులు కొటినా లాభం లేదు, విత్తనాలు అమ్మిన సేటును అడిగితే వచ్చి చూసిపోయిండు కానీ ఏమీ చెప్పలే.
రూ.40 వేలు నష్టపోయిన
నల్లగొండ శ్రీనివాస్, కేసముద్రంస్టేషన్
ఎకరంన్నర భూమిలో 20 ప్యాకెట్ల మిర్చి విత్తనాలు వేసిన. నెలదాటిన మొక్కలు పెరగలే. దాదాపు రూ.40 వేలు పెట్టి మందులు కొట్టినా.. పంట ఎదగలే. ఎవరికి చెప్పినా పట్టించుకోట్లేదు. షాపు వాళ్లని అడిగితే కంపెనీ వాళ్లు మోసం చేసిండని చెప్తాండ్రు.