సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మార్పులు గమనిస్తున్నారా! జంక్షన్లలో జిలుగులు.. సెంట్రల్ డివైడర్లకు రంగులు.. ఐలాండ్లలో వాటర్ ఫౌంటైన్‌లు.. రోడ్లకు లేన్ మార్కింగ్‌లు.. ఫ్లైఓవర్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్‌ఈడీ వెలుగులు.. పార్కుల్లో ఆకట్టుకునేలా ఫర్నిచర్.. ఇలా ఒకటేమిటి వివిధ ప్రాంతాల్లో మనసుకు ఆహ్లాదంగా, కనువిందుగా సరికొత్త దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. రానున్న ఏడెనిమిది నెలల్లో ఇవి మరింత విస్తృతం కానున్నాయి.. దాదాపు పది నెలల్లో బల్దియా పాలకమండలి ఎన్నికలు జరగనుండటంతో.. ఈలోగా నగర ముఖచిత్రాన్ని మార్చేందుకు, సరికొత్త హైదరాబాద్‌ను ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకనుగుణంగా మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులతో తరచూ సమీక్షలునిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పలు ఆదేశాలుజారీ చేస్తూ, బాగున్న వాటిని మరిన్ని పెంచాల్సిందిగా సూచిస్తున్నారు.
ఇటీవల చేపట్టిన ఖైరతాబాద్ జంక్షన్ సుందరీకరణ, ఇందిరాపార్కులో పంచతత్వ పార్కు, శేరిలింగంపల్లి జోన్‌లోని ప్లాస్టిక్ ఫుట్‌పాత్‌లు తదితరమైనవి అన్ని జోన్లలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. బాగున్నవాటిని సత్వరం చేయా ల్సిందిగా మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు. అంతేకాదు.. ఇతర నగరాల్లో బాగున్నవి అధ్యయనం చేసి ఇక్కడ ఆచరించాలని పేర్కొనడంతో ఈ వారం ఆరంభంలో పలువురు జోనల్, అడిషనల్ కమిషనర్లు, ఇంజినీర్లు, తదితర అధికారులు పుణెను సందర్శించి వచ్చారు. అంతకుముందు నాగపూర్ తదితర ప్రాంతాలను సందర్శించి వచ్చారు. పుణెలోని పార్కుల మాదిరి ఫర్నిచర్, రహదారుల్లో క్యారేజ్ వే తక్కువున్న విశాలమైన ఫుట్‌పాత్‌లు, రహదారుల మార్గాల్లోని భవనాల సెట్‌బ్యాక్‌ల్లో ఫుట్‌పాత్‌లు, వీలైనన్ని చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు వంటివి నగరంలోనూ అవకాశమున్న ప్రాంతాల్లో ఆచరించేందుకు సిద్ధమవుతున్నారు.
రూ.59.86 కోట్లతో జంక్షన్లలో సిగ్నలింగ్..
వీటితోపాటు ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకూ సిద్ధమయ్యారు. ప్రస్తుతం 221 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ సంస్థ కాంట్రాక్టు ముగియడంతో మరో మూడేళ్ల పాటు వాటి కొనసాగింపు, కొత్తగా 155 జంక్షన్లలో సిగ్నలింగ్ సిస్టమ్, 98 ప్రాంతాల్లో ఫెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇందుకు ఖర్చయ్యే రూ.59.86 కోట్లకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. నగరంలో 65 ఫౌంటెన్లకుగాను తొలిదశలో 25 ప్రాంతాల్లో రూ. 25 లక్షలతో ఆధునికీకరణ పనులకు సిద్ధమయ్యారు. వీటితోపాటు రాత్రి ఒంటిగంట వరకు ఆహారం అందించే స్ట్రీట్‌ఫుడ్ వంటి వాటిపైనా దృష్టి సారించారు. సంగీత్, ఎల్‌బీనగర్, లక్డికాపూల్, నల్లగొండ జంక్షన్‌లు సహా ఇరవై జంక్షన్లను వివిధ థీమ్‌లతో అభివృద్ధి చేయనున్నారు. ఇటీవలే మెట్టుగూడ సమీపంలోని ఆలుగడ్డ బావి జంక్షన్‌ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దడం తెలిసిందే. పార్కులను అభివృద్ధిపర్చి, నిర్వహించేందుకు దాదాపు రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. నగరవ్యాప్తంగా మూడువేల పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఫ్లైఓవర్ల కింద, రోడ్ల వెంట గోడలకు హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏర్పాటు ఆలోచనలున్నాయి. ప్రత్యేక థీమ్‌లతో మరికొన్ని పార్కులు తీర్చిదిద్దనున్నారు. యోగా శిక్షకులను అందుబాటులో ఉంచనున్నారు.
మరిన్ని బస్తీ దవాఖానాలు..
ప్రజారోగ్యం దృష్ట్యా బస్తీ దవాఖానాల సంఖ్యను 350కి పెంచే ఏర్పాట్లలో ఉన్నారు. తొలిదశలో జోన్‌కు కనీసం రెండు దవాఖానాల చొప్పున 300 అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం పురోగతిలో ఉన్న 18 ఫ్లై ఓవర్లనూ పూర్తిచేయాల్సిందిగా మంత్రి కేటీఆర్ అధికారులను పురమాయించారు. రోడ్లను అద్దాల్లా తీర్చిదిద్దేందుకు ప్రధాన మార్గాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకప్పగించారు. పనులు వేగంగా చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు, బస్తీల్లోనూ కచ్చారోడ్ల స్థానే సీసీ రోడ్లు వేసేందుకూ కార్యాచరణ సిద్ధం చేశారు. వీధి దీపాలు సైతం అన్ని కాలనీలు, బస్తీలు, మారుమూల ప్రాంతాల్లో సైతం ఉండేలా చర్యలకు సిద్ధమయ్యారు. ఇలా వివిధ అభివృద్ధి పనులు, సుందరీకరణలతో బల్దియా ఎన్నికల్లోగా సరికొత్త సింగారాలతో నగర ముఖచిత్రాన్ని అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment