సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 2, 3 తేదీల్లో (శుక్ర, శని) వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితర అధికారులు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఇడుపులపాయలో 2వ తేదీ రాత్రి బస చేయనున్న నేపథ్యంలో అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లింగాల మండలంలోని పార్నపల్లెలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్ద సీఎం వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనుండటంతో అక్కడ కూడా పటిష్ట పోలీసు బందోబస్తు నియమించారు.
నేటి పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 10.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇక్కడి నుంచి బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని పార్నపల్లె వద్ద సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. 12.00 నుంచి 12.30 గంటల వరకు బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు చేరుకుని 12.40 నుంచి 1.00 గంట మధ్యలో వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు లింగాల మండల నాయకులతో మాట్లాడతారు. అంతేకాకుండా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.
రేపటి పర్యటన: శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ఎస్టేట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 9.15 నుంచి 9.30 గంటల మధ్య కదిరిరోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్ గార్డెన్స్‌కు చేరుకుని సీఎం వ్యక్తిగత సహాయకుడు డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
సీఎం పర్యటనకు పోలీసుల రిహార్సల్స్
లింగాల: లింగాల మండలం పార్నపల్లె చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో శుక్రవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో సీఎం పర్యటించే ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్‌తో రిహార్సల్స్ నిర్వహించారు. అలాగే ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు పరిశీలించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్పీ ప్రేర్ణా, నీటిపారుదల శాఖ ఈఈ రాజశేఖర్, పర్యాటక శాఖ ఈఈ ఈశ్వరయ్య, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, తహసీల్దార్ శేషారెడ్డి, ఎంపీడీఓ సురేంద్రనాథ్, పీఆర్ ఏఈ మనోహర్‌రెడ్డి, మత్ప్యశాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీబీఆర్‌పై భారీ పోలీసు బందోబస్తు: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా సీబీఆర్‌పై భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నలుగురు అడిషనల్ ఎస్పీలు, 10మంది డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50మంది ఎస్‌ఐలతోపాటు 1500 మంది పోలీసు బలగాలు సీబీఆర్‌కు చేరుకున్నాయని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment