సాక్షి, హైదరాబాద్: ‘పుష్టికర భారత్’నిర్మాణంలో భాగంగా నీతి ఆయోగ్ సరికొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొస్తోంది. బియ్యం, గోధుమలు, పప్పుధాన్యాలతో పాటు ప్రొటీన్ సహిత ఆహారపదార్థాలను కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా దేశంలోని పేదలకు అందజేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలి స్తోంది. గుడ్లు, చికెన్, మాంసం, చేపలను ఈ జాబితా లో చేర్చింది. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పుష్టికర ఆహారాన్ని వీలైనంత తక్కువ ధరలకే పేదల కు అందజేయాలనే ఈ ప్రతిపాదనను తన 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌లో పెట్టే అవకాశాలున్నాయి.
అమలు, పంపిణీపై అధ్యయనం
పౌష్టికాహార లోపం సమస్యను నివారించడంలో భాగంగా గుడ్లు, చికెన్, మాంసం, చేపలు లాంటి ప్రొటీన్ సహిత ఆహార పదార్థాలను పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే వ్యవస్థను రూపొందించడంపై నీతి ఆయోగ్ అధ్యయనం చేస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ ఈ విషయమై మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న ఆదాయం ద్వారా పౌష్టికాహారం పొందాల్సింది పోయి దురదృష్టవశాత్తు ఎక్కువ మంది నూనె, చక్కెర, మసాల సహిత పదార్థాలపై ఖర్చు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలతో పాటు చట్టసభల సభ్యుల్లో కూడా అవగాహన కల్పించేలా విజన్ డాక్యుమెంట్‌లో ప్రస్తావిస్తామని వెల్లడించారు. ‘పీడీఎస్ ద్వారా ఇప్పటికే సబ్సిడీ ఆహార పదార్థాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాయి.
దీనికి తోడు మాంసాహారం పంపిణీ అమలు భారమయ్యే అవకాశం ఉండటంతో ఇప్పటికే పంపిణీ చేస్తున్న పదార్థాల్లో కొన్నింటిని తగ్గించి మా ప్రతిపాదనల్లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాలను పంపిణీ చేస్తే బాగుంటుంది’అని సూచించారు. ఇప్పటికే మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.5లకు పైగా ఉండగా, కిలో మాంసం వందల్లో ఉంది. ఈ నేపథ్యంలో సబ్సిడీ ఎంత ఇవ్వాలి.. రేషన్ షాపుల ద్వారా వీటి పంపినీ ఎలా చేయాలన్న దానిపై కూడా నీతి ఆయోగ్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు కూడా చేయనుందని తెలిపారు.
43 శాతం బరువు తక్కువ చిన్నారులు
యునిసెఫ్ లెక్కల ప్రకారం దేశంలోని 20 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికాహార లోపంతో బక్కచిక్కిపోతున్నారు. ప్రపంచంలోనే ఇలా బక్కచిక్కుతున్న చిన్నారుల్లో మూడోవంతు పిల్లలు మనదేశంలోనే ఉన్నారు. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 43 శాతం మంది.. ఉండాల్సిన దాని కన్నా తక్కువ బరువున్నారు. అంటే ప్రతి 10 మందిలో కనీసం నలుగురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. పౌష్టికాహార లోపం సమస్య పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోతోంది. ఏటా దేశంలో 7.4 మిలియన్ల బరువు తక్కువ చిన్నారులు ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలోనే జన్మిస్తున్నారు.
33 శాతం మంది చిన్నారులు మాత్రమే అంగన్‌వాడీ సేవలు పొందుతున్నారు. అందులో 25 శాతం మంది ఐసీడీఎస్ ద్వారా పౌష్టికాహారం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు దేశంలోని పేదలకు ప్రోటీన్ సహిత పౌష్టికాహారాన్ని చవకగా పంపిణీ చేయడమే మార్గమనే ఆలోచనకు నీతి ఆయోగ్ వచ్చింది. అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్ రూపొందుతుందని అంచనా. అందులో పీడీఎస్ ద్వారా గుడ్లు, చికెన్, మాంసం, చేపలను పంపిణీ చేయాలనే ప్రతిపాదన చేస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment