
16న ఢిల్లీకి రండి..
* ఆర్టీసీ విభజనపై ఇరు సీఎస్‌లకు నితిన్ గడ్కారీ పిలుపు
* సమస్యపై ఎట్టకేలకు దృష్టి సారించిన కేంద్రం
* ఇద్దరు ప్రధాన కార్యదర్శులతో భేటీకానున్న కేంద్రమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా ఉమ్మడిగానే సాగుతున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై ఎట్టకేలకు కేంద్రం దృష్టి సారిం చింది. దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఈ నెల 16న ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమవుతున్నారు. ఈ మేరకు ఢిల్లీకి రావాల్సిం దిగా గడ్కారీ కార్యాలయం నుంచి ఇద్దరు అధికారులకు లేఖలు అందాయి.
రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఆర్టీసీలో చోటు చేసుకున్న పరి ణామాలు, రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల వాదనలు, ఉద్యోగుల విభజన మార్గదర్శకాలు, వాటి జారీ తర్వాత ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, ఆస్తులు-అప్పులు, వాటి కేటాయింపునకు షీలాభిడే కమిటీ నిర్ణయాలు... ఇలా అన్ని వివరాలను గడ్కారీకి సమర్పించనున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు సీఎస్‌లు విడివిడిగా నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. సెలవు రోజైనప్పటికీ శనివారం ఆర్టీసీ ఈడీలు బస్‌భవన్‌లోనే ఉండి ఈ వివరాలను క్రోడీకరించారు.
కేసీఆర్ జోక్యంతో వేగంగా..: ఆస్తులు, అప్పుల పంపకం జఠిలంగా మారిన నేపథ్యంలో ఆర్టీసీ విభజనలో అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో వాటి పంపకంతో సంబంధం లేకుండా టీఎస్ ఆర్టీసీ ఏర్పాటుకు అనుమతించాలంటూ ఇప్పటికే టీ సర్కార్ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ను కోరింది. ఇటీవల రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి.. గడ్కారీని కలసి ప్రభుత్వ పక్షాన వినతిపత్రం అందజేయడంతో పాటు సీఎం కేసీఆర్ ఫోన్‌లో చర్చించారు. దీంతో రెండు రాష్ట్రాల సీఎస్‌లను ఢిల్లీకి రావాల్సిందిగా శుక్రవారం లేఖలు పంపారు.
వెంటనే బోర్డు సమావేశం?
నితిన్ గడ్కారీతో భేటీ అయిన వెంటనే ఆర్టీసీ పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల కేటాయింపుపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తెలంగాణ ఉద్యోగుల పంపిణీకి జారీ అయిన కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలనే ఆర్టీసీ పేరు మార్చి అనుసరించింది. ఇందులో ఆప్షన్లకు అవకాశం కల్పించడాన్ని తెలంగాణ ఉద్యోగులు తీవ్రంగా వ్యతి రేకిస్తున్నారు. ఇక నగరంలోని ఆర్టీసీ ‘ఉమ్మడి ఆస్తుల’కు సంబంధించి కేంద్రం నియమించిన షీలాభిడే కమిటీ ఆదేశంతో ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ మూల్యాం కనం చేసి ఓ నివేదికను అందజేసింది. వీటి కి బోర్డు ఆమోదం అవసరమున్నందున సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఢిల్లీ సమావేశంలో గడ్కారీ సూచనల ఆధారంగా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.