
నిజాంను కీర్తించడమా?
నిజాం రాజును కీర్తిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడడం ఆక్షేపణీయమని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు.
- కేసీఆర్ వ్యాఖ్యలు ఆక్షేపణీయం: సురవరం
సాక్షి,హైదరాబాద్: నిజాం రాజును కీర్తిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడడం ఆక్షేపణీయమని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. కాటన్-నిజాంల మధ్య సామ్యం తేవడం ఏమాత్రం సరికాదని, నిజాంను పొగడడం ద్వారా ముస్లింలకు దగ్గర కావాలనుకోవడం పొరబాటు భావన అని అన్నారు.
శుక్రవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొమురం భీమ్‌ను, కమ్యూనిస్టు కార్యకర్తలను చంపిన నిజాంను ఎలా పొగుడుతారని ప్రశ్నించారు.
ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’’ మోదీ తిరోగమన చర్య ప్రణాళిక సంఘం స్థానంలో ‘నీతిఆయోగ్’ను తీసుకురావడం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న తిరోగమన చర్య అని సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. కార్పొరేట్‌రంగానికి సానుకూలంగా , దేశ ఆర్థికవ్యవస్థను వారికి అనుకూలంగా మార్చే దుస్సాహసానికి కేంద్రం పాల్పడుతోందని ధ్వజమెత్తారు.