మా ఊళ్లో మద్యం వద్దు
అమ్మనియ్యం.. తాగనియ్యం
మల్కపేటలో మహిళల తీర్మానం
కోనరావుపేట: కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామస్తులు మద్యం మహమ్మారిని ఊరి నుంచి తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో ‘మద్యం అమ్మనియ్యం.. ఎవరినీ తాగనియ్యం’ అంటూ సోమవారం ప్రతిజ్ఞ చేశారు. మద్యం కారణంగా జరుగుతున్న అనర్థాలను అరికట్టాలని భావించిన గ్రామ మహిళలు తమ నిర్ణయాన్ని సర్పంచ్ ఒగ్గు లావణ్యకు తెలిపారు. సోమవారం గ్రామంలోని పోశమ్మ ఆలయ ఆవరణలో మహిళలందరూ సమావేశమై ఊరిలో బెల్ట్‌షాపులు ఉండొద్దని, విక్రయాలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, దీనిని కాదని ఎవరైనా విక్రయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
తమ తీర్మానం ప్రతిని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై రాయుడుకు సమర్పించారు. మహిళలు సమష్టిగా తీసుకున్న ఈ నిర్ణయానికి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు ఏల్పుల సరిత, ఆరె రేణుక, ఎక్కల్‌దేవి రజిత, ఎర్రోల్ల దేవవ్వ, జవ్వాజి శ్రీలత, ఇప్ప రాజవ్వ, సీఏ జవ్వాజి కవిత, మహిళలు పాల్గొన్నారు.