సాక్షి, హైదరాబాద్ : బ్యాంకు రుణం విషయంలో సీబీఐ నోటీసులు ఇచ్చినట్టుగా తమ కుటుంబంపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐ ఇచ్చినట్టుగా నకిలీ నోటీసులు సృష్టించి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, అంజ య్య, ఎమ్మెల్సీ కె.నారాయణరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. నకిలీ నోటీసులతో తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేసి పరువు తీసినవారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని జూపల్లి హెచ్చరించారు. వ్యాపారాల్లో ఉన్నవారు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం సహజమని.. రాజకీయాల్లోకి రాకముందే ఎల్‌ఐసీ, ఫ్రుడెన్షియల్ బ్యాంకుల్లో అప్పులు తీసుకుని, పూర్తిగా చెల్లించేశామని వివరించారు. తన కుమారుడు అరుణ్ కూ డా వ్యాపారం కోసం అప్పులు తీసుకున్నాడని, అందులో రూ.31 కోట్లకు పైగా తిరిగి చెల్లించేశాడని చెప్పారు. ఇలా చెల్లించిన మొత్తం గురించి ఎవరూ పేర్కొనకపోవడం వెనుక కుట్ర ఏమిటని ప్రశ్నించారు.
తప్పులు చేయడం లేదు: తాము అప్పులు చేయడం తప్ప.. తప్పులేమీ చేయడం లేదని జూపల్లి పేర్కొన్నారు. వ్యాపారాల ద్వారా సొం తకాళ్లపై నిలబడటం తప్పుకాదని, పదవులను అడ్డం పెట్టు కుని పైరవీలు చేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. ఆస్తులను తనఖా పెట్టుకునే బ్యాంకులు అప్పులు ఇచ్చాయని, వాటి ని వడ్డీతో సహా వసూలు చేసుకుంటాయని స్ప ష్టం చేశారు. అరుణ్‌ను నీరవ్ మోదీతో పోలుస్తారా, అరుణ్ ఎక్కడికైనా పారిపోయారా అంటూ జూపల్లి భావోద్వేగానికి గురయ్యారు.
రాజకీయంగా ఎదుర్కోలేక..
సీబీఐ నోటీసులిచ్చినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, నకిలీ నోటీసులు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూపల్లి పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక, నైతికంగా దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని.. తన ప్రతిష్టను దెబ్బతీసి కొందరు రాజకీయ లబ్ధి పొందే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాము ఏ తప్పు చేసినా పదవుల నుంచి వెంటనే తప్పుకుంటానన్నారు. తెలంగాణ కోసం మూడున్నరేళ్ల మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర తనదని.. ఇసుక అంశంలో తప్పుచేసిన వారిని గుర్తించి, పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. సమాజంలో ఎంతో మందిని ముంచినోళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని.. వారు నీతులు చెప్పడం మానుకోవాలని జూపల్లి సూచించారు. సీబీఐ పేరిట తప్పుడు నోటీసులను తయారు చేసినవారిపై పరువునష్టం దావా, క్రిమినల్ కేసులు వేస్తానని ప్రకటించారు. కాగా.. మంత్రిగా జూపల్లి అభివృద్ధిని, పార్టీ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య విమర్శించారు. పథకాలు, కార్యక్రమాల్లో తప్పులు పట్టుకోలేక ప్రతిపక్ష నేతలు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment