మా కేసీఆర్ మారలె..
- కాన్వాయ్ ఆపి స్నేహితులను పలకరించిన సీఎం
- ఆనందం వ్యక్తం చేసిన సిద్దిపేట వాసులు
సాక్షి,సిటీబ్యూరో: ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి.. చుట్టూ భారీ బందోబస్తు, కార్లెనక కార్లు..అయినా రోడ్డుపై వెళ్తున్న పరిచయస్తులను గుర్తుపట్టి కారు ఆపారు. ‘అన్నా ఏందే ఇట్ల వచ్చిన్రు’ అని పలకరించి ఇంటికి తీసుకెళ్లారు. వివరాల్లోకెళ్తే.. ఆదివారం సెలవు కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులు, మంత్రులతో పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
అతిథులతో చాలాసేపు గడిపారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో కాన్వాయ్‌లో వెళ్తుండగా..క్యాన్సర్ ఆస్పత్రి మలుపువద్ద ఇద్దరు సాధారణ వ్యక్తులు కేసీఆర్‌ను నమస్తే..అని పలకరించారు. వారిని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే తన వాహనాన్ని ఆపి ‘ఎటు వచ్చిన్రు అనగా..మిమ్ముల్ని కలవనీక వచ్చినం అనడంతో..ఇంట్లపోయి కూర్చొండి.. అన్నం తిననీక పోతున్న తొందరగా వస్తా’ అని చెప్పి వెళ్లారు. వెంటనే పోలీసులు వారిద్దరిని ముఖ్యమంత్రి ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి వారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..‘మాది సిద్దిపేట..కేసీఆర్‌కు చిన్ననాటి నుంచి పరిచయస్తులం. తెలంగాణకు తొలిముఖ్యమంత్రి కావడంతో శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినం. సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ కారులోంచి చూసి ఆపి పలకరించడం ఎంతో ఆనందంగా ఉంది. కేసీఆర్ సిద్దిపేటలో ఎట్లా పలకరిస్తడో..ముఖ్యమంత్రి అయినా అలాగే కలి సిండు, మా కేసీఆర్ మారలె’ అని వారు ఉబ్బితబ్బిబ్బయ్యారు.