
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విత్తన కంపెనీల అక్రమాలను అరికట్టడంలో ముందుండాల్సిన వ్యవసాయ ప్రయోగశాల(ల్యాబ్)లు.. ఆ కంపెనీలిచ్చే అప్పులతోనే నడుస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో నిర్వహణ కష్టమవుతోందని, కంపెనీల నుంచే అప్పులు తీసుకుంటూ ల్యాబ్‌లు నడిపించాల్సిన దుస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. వివిధ పథకాల కోసం వ్యవసాయ శాఖ నుంచి ఏడాదికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తుంటారు. ల్యాబ్‌లకు రూ.1.36 కోట్లు ఇవ్వడానికి అశ్రద్ధ చూపటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోజూవారీ ఖర్చులూ కష్టమే..
విత్తనాల నాణ్యత, నకిలీ విత్తనాల గుర్తింపు కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెండు ల్యాబ్‌లు నడుస్తున్నాయి. ఒకటి మలక్‌పేటలో డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ ల్యాబ్ కాగా, మరో విత్తన పరీక్షల ల్యాబ్ రాజేంద్రనగర్‌లో ఉంది. జాతీయస్థాయిలో ఈ రెండూ ప్రతిష్టాత్మకమైన ల్యాబ్‌లే. 2 ల్యాబ్‌లలో ఏడాదికి 9 వేల నమూ నాలు పరీక్షిస్తారు. ప్రభుత్వం మాత్రం రోజువారీ నిర్వహణ ఖర్చులు కూడా విడుదల చేయడం లేదని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల పరీక్షలూ ఇక్కడే
ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవకపోవడంతో ప్రైవేటు కంపెనీల నుంచి అప్పులు తీసుకుంటూనే ఇతర రాష్ట్రాల నమూనాలు కూడా పరీక్షించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఇటీవల గుజరాత్, మహారాష్ట్ర వ్యవసాయ శాఖ లు కూడా నమూనాలను ఇక్కడే పరీక్ష చేయించాయి. ఆ పరీక్షల నుంచి వచ్చే చార్జీలతోనే ఎంతో కొంత నిర్వహణ ఖర్చులకు సంపాదిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment