సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రుల్లోని బోధనావైద్యుల ఉద్యోగ విరమణ వయసు పొడిగింపుపై సర్కారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన వైద్యుల విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచాలని మూడు నెలల కిందట రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దానికి సంబంధించి ఇప్పటివరకు మార్గదర్శకాలుగాని, ఉత్తర్వులుగాని విడుదల కాలేదు. దీంతో విరమణ పొందుతున్న, పొందడానికి సిద్ధంగా ఉన్న బోధన వైద్యుల్లో ఆందోళన నెలకొంది. విరమణ వయసు పొడిగింపు యోచనను కొన్ని ప్రభుత్వ వైద్యుల సంఘాలు వ్యతిరేకిస్తుండగా, మరికొన్ని సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విరమణ వయసు పొడిగింపుపై ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న వాదనలు వినిపించాయి. అయితే ‘మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా వెనక్కు తీసుకుంటుంది. బదిలీలు, ఇతరత్రా అంశాలున్నందున కొంత విరామం తీసుకున్నాం. అంతే తప్ప విరమణ పొడిగింపుపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయి’అని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఇటీవల చెప్పాయి.
ఇతర ఉద్యోగుల నుంచీ పెంపు డిమాండ్
వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, నిమ్స్ సహా ఆదిలాబాద్ రిమ్స్, మహబూబ్‌నగర్, సిద్దిపేట తదితర స్వయం ప్రతిపత్తి, పాక్షిక స్వయం ప్రతిపత్తి గల వైద్య కళాశాలన్నింటిలోనూ విరమణ పెంపు విధానం అమలులోకి తీసుకురావాలనేది సర్కారు ఆలోచన. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తుండటంతో ప్రభు త్వం విరమణ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. గతేడాది 220 పీజీ సీట్లు అదనంగా రాష్ట్రానికి వచ్చా యి. ఈ ఏడాది మరో 40 పీజీ సీట్లను ఇదే ప్రాతిపదికన ఎంసీఐ పెంచింది. ఈ సమయంలో వైద్యుల విరమణ పొందితే పీజీ సీట్లకు కోత పడుతుందనేది సర్కారు భావన. అందుకే విరమణ వయ సును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు అంటే ఏడేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment