సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణలోనే రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎలాంటి కదలికా కనిపించడం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. నామినేటెడ్ పదవుల్లేక, కనీసం మంత్రి పదవి లేక టీఆర్‌ఎస్, నలుగురు ఎమ్మెల్యేలను గెలుచుకున్నా సమన్వయం లేని కాంగ్రెస్, మహామహుల ఓటమితో కంగుతిన్న టీడీపీ, ఆశించిన ఫలితాలు రాని వామపక్షాలు... వెరసి జిల్లా రాజకీయం ఇప్పుడు నిస్తేజంగా మారింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రమంతా ఇప్పుడు క్యాంపు రాజకీయాలతో కంగారెత్తిపోతుంటే జిల్లాలో మాత్రం అలాంటి హడావుడే కనిపించడం లేదు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా కోర్టు ఇప్పటికే స్టే విధించడంతో ఏ పార్టీ క్రియాశీలం కాలేకపోతోంది. మరోవైపు జిల్లాలో ఎనిమిది మున్సిపాలిటీలుండగా, నాలుగింటికి ఎన్నికలు జరిగినా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే రాజకీయం కొంతమేర రసకందాయంలో పడింది. ఇక, అన్నింటి కన్నా కీలకమైన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియక జిల్లా కేంద్ర రాజకీయాలూ డైలమాలోనే ఉన్నాయి.
అమాత్యయోగం లేదా..?
జిల్లాలో పెద్దగా బలం లేని టీఆర్‌ఎస్ కేడర్ ఇప్పుడు పూర్తి అయోమయంలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వచ్చినా, మన జిల్లాలో మాత్రం కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఒకటి, రెండు చోట్ల మినహా టీఆర్‌ఎస్ ఎక్కడా నిర్మాణపరంగా బలంగా లేదు.
ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక నామినేటెడ్ పోస్టులు వస్తాయని, తద్వారా కేడర్‌ను పెంచుకోవాలని ఆ పార్టీ నాయకులు ఆశించారు. అయితే, నామినేటెడ్ పోస్టుల మాటేమో కానీ, మంత్రివర్గంలో కూడా స్థానం లభించలేదు. జిల్లా నుంచి జలగం వెంకట్రావు ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు కేబినెట్‌లో స్థానం దక్కలేదు. కారణమేదైనా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం జిల్లా పార్టీ కేడర్‌ను నైరాశ్యంలో నింపింది. అయితే, మంత్రివర్గంలో చోటు ఎలా ఉన్నా జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా కేసీఆర్‌కు సన్నిహితులు వస్తారని, ఆయన ద్వారా పార్టీ బలోపేతమవుతుందనే చర్చ టీఆర్‌ఎస్‌లో జరుగుతోంది.
కానీ అటు మంత్రివర్గ విస్తరణ లేక, ఇటు ఇన్‌చార్జి మంత్రుల నియామకం లేక పార్టీ కేడర్ అయోమయంలో పడింది. ఇంతలోనే ఆషాడ మాసం రావడంతో మరో నెల పాటు భవిష్యత్తుపై ఆశలతోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక మార్కెట్ కమిటీల్లాంటి నామినే టెడ్ పోస్టులూ ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయంలో స్పష్టత లేకపోవడంతో మిణుకు ఆశలతో టీఆర్‌ఎస్ నేతలు నెట్టుకొస్తున్నారే తప్ప క్రియాశీలకంగా పనిచేయలేని పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్‌ది ఎప్పటి కథే...
రాష్ట్రంలో అధికారం తప్పదని భావించిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులకు రుచించడం లేదు. అధికారంలోనికి రాలేదన్న షాక్ నుంచి పార్టీ నాయకత్వం ఇంకా పూర్తిగా బయటపడలేదు. జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినా, నలుగురూ నాలుగు గ్రూపులకు చెందిన వారు కావడం... సమన్వయం లేకపోవడం.... కనీసం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని నియమించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ పార్టీ కేడర్ తీవ్ర గందరగోళంలో ఉంది. మరోవైపు ఇప్పటివరకు అనుభవించిన నామినేటెడ్ పోస్టులన్నింటినీ త్వరలోనే వదులుకోవాల్సి వస్తుందనే బాధ కూడా కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఐదేళ్ల పాటు పార్టీని ఎలా నడిపించాలో, కేడర్‌ను ఎలా కాపాడుకోవాలో అని కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఎవరి పయనం ఎటో..?
ఇక, జిల్లాలో అన్ని పార్టీల కన్నా తీవ్ర మథనంలో ఉన్నది టీడీపీ అనే చెప్పుకోవాలి. రెండు గ్రూపులు, నాలుగు గొడవలతో సార్వత్రిక ఎన్నికలలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు తమ్ముళ్లు అసలు తమ భవిష్యత్తు ఏమిటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని రెండు గ్రూపులకు నాయకత్వం వహించిన ఇద్దరు నేతలూ ఓటమి పాలు కావడం, కేవలం ఒక్క ఎమ్మెల్యేనే గెలుపొందడాన్ని ఆ పార్టీ కేడర్ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. మరోవైపు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నికల తర్వాత పార్టీపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం, మాజీ మంత్రి తుమ్మల కూడా అంటీముట్టనట్టు ఉండడం ‘తమ్ముళ్లను’ నైరాశ్యంలో నింపుతోంది.
ఇక టీడీపీకి చెందిన ఓ గ్రూపు పూర్తిగా టీఆర్‌ఎస్ చేరబోతోందని, ఇందుకు రంగం సిద్ధమవుతోందని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారాల్సిందేనని తుమ్మలపై తన అనుచరులు ఒత్తిడి తెస్తున్నా ఆయన మాత్రం గుంభనంగానే ఉంటున్నారు. తుమ్మల ఏం చేస్తారో చూసి దాన్ని బట్టి జిల్లాలో రాజకీయాలు నెరుపుదామని నామా ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసలు ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు ఉండరో అర్థం కాక తెలుగుతమ్ముళ్లు అయోమయంలో పడ్డారు.
ఎర్ర పార్టీల పరిస్థితీ అంతే...
ఎప్పుడూ జిల్లాలో క్రియాశీలకంగా ఉండే వామపక్షాలు కూడా ఎన్నికల తర్వాత స్తబ్దుగానే ఉన్నాయి. పోలవరం ముంపు మండలాల అంశం మినహా మిగిలిన ఎలాంటి పోరాట కార్యక్రమాలకూ ఆ పార్టీలు పదును పెట్టడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షలను, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే స్థాయిలో ఇంకా ప్రణాళిక రచించలేదు. ఇక, వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం వారి పని వారు చేసుకుపోతున్నారు. ఎంపీ పొంగులేటి జిల్లాలో సమీక్ష సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటున్నారు.
కరెంట్ ఎఫైర్‌లోనూ ‘మజా’ లేదు
కోర్టు కేసుల కారణంగా జిల్లా రాజకీయం మరింత స్తబ్దుగా తయారైంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ప్రారంభమై వేడి పుట్టిస్తుంటే మన జిల్లాలో మాత్రం అలాంటి అవకాశమే లేకుండా పోయింది. జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో కోర్టు స్టే విధించడం, అదే తరహాలో కోర్టు తీర్పు కారణంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడంతో రాజకీయ మజా అనేదే కనిపించడం లేదు. జిల్లాలో ఉన్న ఎనిమిది మున్సిపాలిటీలకు, కేవలం నాలుగింటికే ఇటీవల ఎన్నికలు జరిగాయి.
ఆ నాలుగింటిలో సత్తుపల్లిలో టీడీపీ, ఇల్లెందులో కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాలు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా ఎందుకైనా మంచిదని మొక్కుబడి క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇక మధిరలో కాంగ్రెస్, టీడీపీలు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చాయి. మిగిలింది ఒక్క కొత్తగూడెం మున్సిపాలిటీనే... ఇక్కడే ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ మినహా జిల్లా రాజకీయాల్లో ఎలాంటి ఉత్తేజం కనిపించకపోవడం గమనార్హం.
ప్చ్..మజాలేదు
Published Wed, Jul 2 2014 5:00 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement