పైసలిస్తేనే కరెంట్ ఇస్తాం | no power supply, until dues clear | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే కరెంట్ ఇస్తాం

Published Wed, Oct 1 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

పైసలిస్తేనే కరెంట్ ఇస్తాం

పైసలిస్తేనే కరెంట్ ఇస్తాం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణను విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. మార్కెట్లో విద్యుత్‌ను కొనుగోలు చేసే దారులూ క్రమంగా మూసుకుపోతున్నాయి. తమకు రూ. 250 కోట్ల బకాయిలు చెల్లించకపోతే విద్యుత్‌ను విక్రయించలేమని అనధికారికంగా పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ (పీటీసీ) స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్‌టీపీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్‌లకు కూడా తెలంగాణ డిస్కంలు భారీగా బకాయి పడ్డాయి. 15 రోజుల్లో బిల్లు చెల్లిస్తేనే తాము విద్యుత్ విక్రయిస్తామని ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తం సక్రమంగా రాకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి.
 
 జూలై నుంచి బిల్లుల చెల్లింపులు నిల్
 
 రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంల ఆర్థికపరిస్థితి కుంచించుకుపోతోంది. విద్యుత్‌కొనుగోలు, పంపిణీ ఖర్చు పెరిగినప్పటికీ చార్జీలు మాత్రం పెరగలేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తం రావడం లేదు. ప్రభుత్వం సబ్సిడీ రూపంలో (ఉచిత విద్యుత్, గృహాలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేసినందుకు) ప్రతినెలా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు 393 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.208 కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. దీంతో డిస్కంలకు ఇప్పటివరకు 1,132 కోట్ల వరకు బకాయిపడింది. మరోవైపు వివిధ ప్రభుత్వశాఖలు, మునిసిపాలిటీలు, పంచాయతీలు కూడా విద్యుత్ బిల్లులను భారీగా చెల్లించాల్సి ఉంది. సబ్సిడీకి ఆర్థికశాఖ కొర్రీలు వేస్తోంది. రూ. 208 కోట్లకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది. దీంతో డిస్కంలకు విద్యుత్‌ను విక్రయించిన ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలైన ఎన్‌టీపీసీ, టీ జెన్‌కోకు కూడా కలిపి మొత్తం 2 వేల కోట్ల బకాయిలున్నాయని అధికారులు అంటున్నారు.
 
 ఏపీలో బకాయిలు లేవు...
 
 ఏపీలో సెప్టెంబర్ 15 వరకు విద్యుత్ సరఫరా చేసిన అన్ని కంపెనీలకు ఏపీ డిస్కంలు బిల్లులు చెల్లించాయి. దీంతో ఏపీకే విద్యుత్ ఇచ్చేందుకు ఎన్‌టీపీసీతోపాటు అన్ని కంపెనీలు ముందు కొస్తున్నాయి. అందుకే ఏపీ 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొంటుంటే.. తెలంగాణకు కేవలం 3.5 ఎంయూల విద్యుత్తే దొరుకుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement