ఘట్‌కేసర్ టౌన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న సర్కారు వాటి రక్షణకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. నాలుగు రోజుల్లో బడులకు సెలవులు రానున్న నేపథ్యంలో కోట్లాది రూపాయలను ఖర్చుచేసి అందజేసిన విలువైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి రక్షణ గురించి ఇసుమంత కూడా ప్రభుత్వం ఆలోచించకపోవడంతో వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో 423 ఉన్నత పాఠశాలలుండగా 270 సక్సెస్ పాఠశాలలున్నాయి. ఇందులో లక్షలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా సుమారుగా 40 పాఠశాలల్లో మాత్రమే రాత్రి కాపలాదారులు ఉన్నారు.
గాలికొదిలేసిన సర్కారు..
జిల్లాలోని ఒక్కొక్క సక్సెస్ పాఠశాలకు 10 నుంచి 12 వరకు కంప్యూటర్లు, వాటి నిర్వాహణకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లతో కలిపి కోట్లాది రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్‌లను ప్రభుత్వం సమకూర్చింది. సక్సెస్ పాఠశాలలకే కాకుండా ఇతర పాఠశాలల్లో కూడా కంప్యూటర్లు, ఇతర విలువైన ఫర్నీచర్ ఉన్నాయి. మధ్యాహ్నభోజన పథకం ప్రారంభం అయ్యాక బియ్యం, వంట సామాగ్రి ఇతర వస్తువులకు రక్షణ లేకుండా పోతోంది. దీంతో జిల్లాలో అనేక చోరీ సంఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజాగా పట్టణంలోని బాలుర పాఠశాలలో శుక్రవారం రాత్రి ఆటల గది తలుపులు విరగ్గొట్టి పలు ఆట వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇన్ని ఆస్తులున్నా పాఠశాలలను కాపాడడానికి కాపలాదారుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కాపలాదారులు లేని కారణంగానే ఏటా జిల్లావ్యాప్తంగా లక్షల రూపాయలను విద్యాశాఖ నష్టపోతోందని తెలుస్తోంది. గతంలో జిల్లాలోని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులుండేవారు.
దశాబ్ద కాలానికి పైగా జిల్లాలో కింది స్థాయి ఉద్యోగుల భర్తీపై సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిన అనంతరం గద్దెనెక్కిన నూతన సర్కారు, విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఇప్పటివరకు దీనిపై దృష్ట సారించలేదు. వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
రక్షణ లేకుండా పోతోంది...
సర్కారు బడులకు రక్షణ లేకుండా పోతోంది. గతంలోను మా పాఠశాలలో తలుపులు విరగ్గొట్టి ఫ్యాన్లు, బెంచీలను విరగ్గొట్టారు. తాజాగా శుక్రవారం రాత్రి ఆటల గది డోర్‌ను విరగ్గొట్టి ఆట వస్తువులను దొంగిలించారు. గతంలో విరగ్గొట్టిన డోర్లు బాగు చేయించాం, కొత్త తాళాలను కొనుగోలు చేశాం. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం పాఠశాలల రక్షణపై దృష్టి సారించి కాపలాదారుల నియామకానికి కృషి చేయాలి.
-వినోద్‌కుమార్, ఫిజికల్ డెరైక్టర్, జెడ్పీ బాలుర పాఠశాల ఇన్‌చార్జి ఘట్‌కేసర్‌టౌన్
పాఠశాలలకు రక్షణ కరువు!
Published Sun, Apr 19 2015 12:33 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement