సాక్షి, హైదరాబాద్: దబ్బగుంటపల్లి... జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని గ్రామం.. నాలుగున్నర దశాబ్దాల క్రితమే పంచాయతీగా ఏర్పడింది. సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ ఏకగ్రీవం.. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, వంద శాతం పన్ను వసూళ్లు వంటి రికార్డులూ ఉన్నాయి.. చివరికి సీసీ కెమెరాల వ్యవస్థ ఉన్న ఆదర్శ గ్రామమిది. ఇన్ని ప్రత్యేకతలున్న దబ్బగుంటపల్లికి వెళ్లాలంటే మాత్రం మట్టిరోడ్డే దిక్కు. దబ్బగుంటపల్లి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని బొందుగుల శివారు వరకు మట్టి రోడ్డే. వానొస్తే రాకపోకలు బంద్. గ్రామ ప్రజలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదు. ఈ ఒక్క గ్రామమే కాదు... రాష్ట్రవ్యాప్తంగా వందలాది గ్రామాలది ఇదే దుస్థితి. ఇప్పటికీ పూర్తిగా మట్టి రోడ్డే ఉన్న గ్రామాలు 358 వరకు ఉన్నట్టు అంచనా. రోడ్డు సరిగా లేకపోవడంతో.. ఆయా గ్రామాల జనం అష్టకష్టాలు పడుతున్నారు.
జనానికి తప్పని ఇబ్బందులు..
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలోని వందలాది గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేని పరిస్థితి నెలకొంది. ఊరి నుంచి రాకపోకలు చేసేందుకు సరైన వసతి లేకపోవడంతో ఆయా గ్రామాల విద్యార్థులు చదువులకు కూడా దూరమవుతున్నారు. వాహనాలు వచ్చేందుకు కష్టంగా ఉంటుండటంతో రైతులు పంటను అమ్ముకునేందుకు అవస్థ పడుతున్నారు. పంటను మార్కెట్‌కు తీసుకెళ్లలేక గ్రామంలోకి వచ్చిన వ్యాపారులకే అయినకాడికి అమ్ముకుంటున్నారు.
వైద్యం అందాలన్నా ఇబ్బందే..
సరైన రోడ్డు సౌకర్యం లేని గ్రామాల్లో ప్రజలకు అత్యవసర వైద్యం అందే పరిస్థితి ఉండటం లేదు. సమీపంలోని ఆస్పత్రులకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉండటం లేదు. వాహనాలున్నా.. గుంతలతో కూడిన మట్టి రోడ్డులో ప్రయాణంతో పరిస్థితి మరింతగా విషమిస్తోంది.
వీటిపై చిన్న చూపేల?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా రోడ్ల నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. కానీ పలు జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు మాత్రం పక్కా రోడ్లు వేయడం లేదు. తెలంగాణలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ పరిధిలో బీటీ, సిమెంటు, మొరం మట్టిరోడ్డు ఇలా అన్నీ కలిపి 69,500 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నాయి. అయితే రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 25,171 కిలోమీటర్ల కొత్త రోడ్లు, పాతవాటి పునరుద్ధరణ, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందులో 20,915 కిలోమీటర్ల రోడ్ల పనులు పూర్తయ్యాయి. కానీ కొన్ని జిల్లాల్లోని పలు గ్రామాలకు మాత్రం ఇప్పటికీ మట్టిరోడ్లే దిక్కవుతున్నాయి. ఆయా గ్రామాలకు పక్కా రోడ్లు వేసే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తారు రోడ్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వాన పడితే రాకపోకలు బంద్
‘‘ఇప్పటికీ మా ఊరికి మట్టిరోడ్డే దిక్కు.. వాన వస్తే రాకపోకలు బంద్ అవుతాయి. విద్యార్థులు కాలేజీ వెళ్లే పరిస్థితి ఉండదు. రోడ్డు గుంతలు పడుతుండటంతో బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నారు. రాకపోకలకు కష్టంగా ఉంటోంది..’’ – నీలం సిద్ధులు, దబ్బగుంటపల్లి, బచ్చన్నపేట
డ్రైవర్లే గుంతలు పూడ్చుకుంటున్నరు
‘‘ఐదు కిలోమీటర్లు.. ఐదు వందల గుంతలు అన్నట్టుగా మా ఊరికి రోడ్డు ఉంది. కొన్నె, బొందుగుల నుంచి దబ్బగుంటపల్లికి ఆర్టీసీ బస్సు రావాలంటే అడుగు అడుగుకు ఎత్తేస్తుంది. ఈ రూట్‌లో వచ్చేందుకు డ్రైవర్లు భయపడుతున్నారు. వానాకాలంలో, గుంతలు లోతుగా మారినప్పుడు బస్సులు, ఇతర వాహనాల డ్రైవర్లే మట్టి పోస్తూ పూడ్చేస్తున్నారు..’’ – కొంతం స్వామి, దబ్బగుంటపల్లి, బచ్చన్నపేట
ఎన్ని సార్లు అడిగినా..
‘‘మా ఊరికి తారు రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. రోడ్డుపై కంకర తేలింది. తారు రోడ్డు వేయాలంటూ చాలాసార్లు అధికారులను కలిసినం. కానీ ఇప్పటిదాకా మంజూరు కాలేదు..’’ – రవికుమార్, తక్కడ్‌పల్లి, బిచ్కుంద మండలం, కామారెడ్డి జిల్లా
నలభై ఏళ్లుగా మట్టిరోడ్డుపైనే..
‘‘మా గ్రామానికి 1974లో మట్టి రోడ్డు వేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా మాకు ఆ మట్టి రోడ్డే దిక్కు. మా ఊరికి ఇంకెప్పుడు తారు రోడ్డు వస్తుందో తెలియడం లేదు..’’ – కృష్ణారెడ్డి, బలభద్రాయపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా
తారురోడ్డు ఏర్పాటు చేయాలి
‘‘మా ఊరికి ఇప్పటికీ తారు రోడ్డు లేదు. దాంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వాహనాలు దెబ్బతింటున్నాయి. వానొస్తే కదల్లేని పరిస్థితి ఉంటోంది. ఇప్పటికైనా మా ఊరికి తారు రోడ్డు వేయాలి..’’ – అంగిరేకుల శ్రీనివాస్, రామచంద్రపురం, మద్దిరాల మండలం, సూర్యాపేట జిల్లా
పంచాయతీరాజ్ రోడ్ల వివరాలు పొడవు (కిలోమీటర్లలో)
సిమెంటు రోడ్లు 3,003
బీటీ రోడ్లు 22,086
డబ్ల్యూబీఎం రోడ్లు 11,751
మొరం రోడ్లు 13,714
మట్టి రోడ్లు 18,946
Comments
Please login to add a commentAdd a comment