జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లోని ఇల్లు
సినిమా అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సెట్టింగ్స్ లేకుండా ఒక్కపనీ జరగదు. చివరికి స్టూడియోల్లో సైతం సీన్‌కు తగ్గట్టు ‘సెట్’ చేయాల్సిందే. ఖరీదైన ఇల్లులాంటిది వేయాలంటే.? అందులో ఇంటీరియర్ రిచ్‌గా ఉండాలంటే.? మాత్రం లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సిందే. మరి ఏ గ్రాఫిక్‌నో నమ్ముకుంటే.? అబ్బే.. ప్రేక్షకులు గుర్తుపట్టేస్తారు. అంతా నేచురల్‌గా ఉండాలి. మరేం చేయాలి. నిజమైన ఇంట్లోనే షూటింగ్ చేయాలి. అదెలా అంటారా? ఇప్పుడు నగరంలోని కొన్ని ఖరీదైన ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. ఇళ్ల యజమానులకు ఇదో ఆదాయ మార్గంగా మారింది.
‘లౌక్యం’ సినిమాలోని కొన్ని సీన్లు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.72లోని ఇంట్లో (ఇంటి నంబర్ 96–3) చిత్రీకరించారు. ఆ ఇంటి యజమానికి సినిమాలంటే ఇష్టం. నాలుగేళ్లుగా ఆ ఇంట్లో చాలా సినిమాలు షూట్ చేశారు. లైఫ్ ఈజ్ బ్యూటిపుల్, పైసా, పవిత్ర, ఒక లైలా కోసం.. వంటి సినిమాల్లోని ఇంటి లోపల సీన్లు చాలా వరకూ ఇక్కడే చిత్రీకరించారు. షూటింగ్ లొకేషన్‌కు తగ్గట్టుగా ఈ ఇంట్లోని చెట్లు, మొక్కలు అందర్నీ ఆకర్షిస్తాయి. అందుకే ఈ ఇల్లు సినిమా లొకేషన్‌గా మారింది.
సెట్టింగులకు బోలెడంత ఖర్చుతో పాటు సమయం కూడా వృథా అవుతుంది. అందుకే రిచ్‌గా ఉండే హౌస్‌లను నమ్ముకుంటున్నారు నిర్మాతలు. నగరంలో ఇలాంటి ఇళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి ఇళ్లను కొన్ని రోజులు బుక్ చేసుకొని తక్కువ మొత్తంలోనే పని కానిచ్చేస్తున్నారు. సినిమాలపై అభిమానం, వెండితెరపై తమ ఇల్లు కనిపిస్తుందన్న ఆశ.. పైగా ఆర్థికంగా లాభసాటిగా ఉండడంతో వాటి యజమానులూ ఓకే అంటున్నారు.
ఇంటి లోపల రిచ్‌నెస్
క్లాస్ అండ్ క్లాసిక్
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సాయితేజ అపార్ట్‌మెంట్ టెరస్ర్ సినిమా లొకేషన్ పాయింట్. అపార్ట్‌మెంట్ ఐదో అంతుస్తులో ‘ఎరబ్రస్సు’ చిత్రీకరణ జరిగింది. ఇంటి యజమాని రవీంద్రారెడ్డి బిల్డర్. దీంతో ఇంటిని కాస్త భిన్నంగా, అందంగా కట్టించారు. టెరస్ర్‌పై విశాల స్థలంలో గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా చేయించుకున్న వాల్ మ్యూరల్స్ ఈ గార్డెన్‌కు అదనపు ఆకర్షణ. అంతేకాదు అడుగడుగునా శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. రాత్రిపూట టెరస్ర్ మొత్తం రంగురంగుల కాంతుల్లో మెరిసిపోతుంది. రెండేళ్లుగా ఈ ఇంట్లో పదుల సంఖ్యలో సినిమాలు షూట్ చేశారు. ఇంటి లోపల లేటెస్ట్‌గా డిజైన్ చేసిన ఓపెన్ కిచెన్, విశాలమైన హాల్ కూడా షూటింగ్‌లో చేరిపోయాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్. 26లోని ‘ఛత్రపతి హౌస్’లోనూ షూటింగ్‌లు జరుగుతుంటాయి. ‘ఛత్రపతి’ సినిమాలోని చాలా సీన్లు ఇక్కడ షూట్ చేయడంతో ఆ ఇంటికా పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment