అంగన్‌వా‘డీలా’      | No Students In Anganwadi | Sakshi
Sakshi News home page

అంగన్‌వా‘డీలా’     

Published Tue, May 15 2018 8:44 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

No Students In Anganwadi  - Sakshi

నార్సింగి అంగన్‌వాడీ కేంద్రంలో 14 మందికి గాను హాజరైన ఇద్దరు చిన్నారులు

రామాయంపేట(మెదక్‌) : రామాయంపేట ఐసీడీఎస్‌ పరిధిలో అంగన్‌వాడీ వ్యవస్థ గాడి తప్పింది. వేసవిలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ కేంద్రాలు తెరవాల్సి ఉండగా,  చాలా వరకు అసలు తెరుచుకోవడం లేదు. కొన్ని కేంద్రాలు తెరచి ఉంచినా అక్కడ అసలు పిల్లలు రాని దృశ్యాలు కన్పిస్తున్నాయి. దీంతో నిర్వాహకులు చిన్నారులు కేంద్రాలకు హాజరైనట్లు తప్పుడు రికార్డు నమోదు చేసి గుడ్లు, బియ్యం, పప్పు తదితర సరుకులు దుర్వినియోగం చేస్తున్నారనే  ఆరోపణలు  వినిపిస్తున్నాయి.

నిజాంపేట, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, రామాయంపేట మండలాల్లో  మొత్తం 275 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి.  వీటిలో 37 మినీ కేంద్రాలున్నాయి.  ‘సాక్షి’ ప్రతినిధి సోమవారం  రామాయంపేట, నిజాంపేట, చేగుంట,  చిన్నశంకరంపేట మండలాల్లో పలు కేంద్రాలను పరిశీలించగా, చాలావరకు అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడి ఉన్నాయి.

 తెరచి ఉన్న కొన్ని కేంద్రాల్లో కూడా పిల్లలు లేరు.   వేసవి ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి నెలకొన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది.  కొన్ని కేంద్రాల్లో మాత్రం  రికార్డులో ఉన్న పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఒకటి అటూ ఇటూ కేంద్రానికి హాజరైనట్లు  నమోదు చేస్తున్నారు.  తనిఖీ చేసిన 35 కేంద్రాల్లో రెండింటిలో మాత్రమే పిల్లలున్నారు. ఒక దాంట్లో ఇద్దరు, మరోదాంట్లో ఐదుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు.

అధికారులు తనిఖీలు చేయకపోవడం, ఉన్నతాధికారులు కొందరు ఉదాసీనత ప్రదర్శించడంతో నిర్వాహకులు ఆడింది ఆటగా కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఎవరొస్తే మాకేమిటి అన్న చందంగా కేంద్రాల నిర్వాహకులు ప్రవర్తిస్తున్నారు. 

ఒక్కరు కూడా హాజరు కాలేదు..

ప్రతిరోజూ ఆయా పిల్లలను వారి ఇళ్ల నుంచి తీసుకరావాలనే నిబంధనలుండగా, వాటిని గాలికి వదిలేసారు. వేసవిలో నెలలో 15 రోజలపాటు ఆయాలు, మరో 15 రోజులు టీచర్లు  కేంద్రాలు నడపాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు.  కొన్ని గ్రామాల్లో రోజుల తరబడి అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడినా అడిగే నాథుడు కరువయ్యాడు.

పలు కేంద్రాల్లో పిల్లలు రాకపోయినా వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేస్తూ  కొందరు టీచర్లు గుడ్లు, బియ్యం, పప్పు, ఇతర సరకులు దుర్వినియోగం చేస్తున్నారు. పది మంది ఉన్న ఒక కేంద్రంలో  సోమవారం ఒక్కరు కూడా హాజరుకాకపోగా, అంతకు రెండు, మూడు రోజులముందు ఎనిమిది, తొమ్మిది మంది చిన్నారులు హాజరైనట్లు నమోదు చేయడం గమనార్హం. కాగా కేంద్రాలపై  నిఘా కరువైనందున   గ్రామాల్లో నిరసన వ్యక్తం అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement