వేసవి కాలం వచ్చిందంటే తాగునీటికి తండ్లాడాల్సిన పరిస్థితి ఉండేది. బిందెలు పట్టుకొని బోర్లు, ట్యాంకర్ల వద్దకు పరుగులు తీయాల్సి వచ్చేది. కానీ ప్రస్తుత వేసవిలో అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలో భూగర్భ జలాలు ఆశాజనకంగానే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే రిజర్వాయర్లు, బావులు, చెరువుల్లో నీటిమట్టం పెరగడంతో నీటి ఎద్దడి అంతగా ఉండదని భావిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు తగ్గుతూ ఉంటాయి. అయితే గత వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్తరామదాసు ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భ జలాలు పెంపొందాయి. దీంతో జిల్లాలో అత్యధిక ప్రాంతాల్లో నీరు సమృద్ధిగా ఉన్నట్లు భూగర్భ జల శాఖాధికారులు చెబుతున్నారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని 21 మండలాల పరిధిలో 584 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత వానాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో జలమట్టం తెలుసుకునేందుకు అధికారులు ప్రతి నెలా 66 ప్రాంతాల్లో వివరాలను సేకరిస్తుంటారు.
ఆ వివరాలనుబట్టి గతేడాదితో పోలిస్తే నీటిమట్టం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈ ఏడాది నీటి ఎద్దడి ఒకటి, రెండు ప్రాంతాల్లో మినహా అంతటా జలాలు సమృద్ధిగానే ఉంటాయని చెబుతున్నారు.
పెరిగిన నీటిమట్టం..
జిల్లాలో సరాసరి నీటి పరిస్థితిని అధికార యంత్రాంగం పరిశీలించింది. గతేడాది ఫిబ్రవరిలో 5.52 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 5.34 మీటర్లు ఉంది. దీంతో 0.18 మీటర్ల జలం అధికంగా ఉంది. గతేడాది మార్చిలో భూగర్భ జలమట్టం 6.53 మీటర్లు ఉండగా, ఈ ఏడాది మార్చిలో 5.85 మీటర్లు ఉంది. గతంకంటే 0.68 మీటర్లు ఎక్కువగా ఉంది. అలాగే గతేడాది ఏప్రిల్‌లో 6.99 మీటర్ల లోతులో నీరు ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 6.20 మీటర్ల నీరుంది. అంటే 0.79 మీటర్ల జలం అధికంగా ఉంది.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా..
66 ప్రాంతాల్లో భూగర్భ జలాల వివరాలు సేకరిస్తున్నారు. సరాసరిన చూస్తే జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం కనిపించడం లేదు. భక్తరామదాసు ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ పథకం కింద ఆయా మండలాల్లో భూగర్భ జలాలు దాదాపు పెరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి, బోనకల్, మధిర, కూసుమంచి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైతులు ఒకే రకమైన పంటలు ఎక్కువగా వేశారు. వీటికి నీరు ఎక్కువగా ఉపయోగించిన ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి.
పొదుపుగా వాడుకోవాలి
ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేదు. నీటిని పొదుపుగా వాడుకోవడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. తాగునీటికి డోకా లేదు. జలమట్టం వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం.– వి.ఆనంద్‌కుమార్,జిల్లా భూగర్భ జల శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment