
సాగర్ కుడి కాల్వకు చుక్క నీరిచ్చేదిలేదు!
రాష్ట్ర సర్కారు నిర్ణయం
కృష్ణా డెల్టాకూ అంతే
మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన సమీక్ష సమావేశం.. ఏపీ లిఖిత పూర్వకంగా కోరితే నీటి విడుదలను పరిశీలించేందుకు సుముఖత
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జల వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద నీటిని తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు అడ్డుకట్ట వేసే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుడి కాల్వ కింద నీటి మట్టాలు పడిపోవడంతో తూముల గేట్లు ఎత్తి నీరందించాలన్న ఏపీ వినతిని తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. కుడి కాల్వ కింద ఇప్పటికే అదనంగా 6 నుంచి 7 టీఎంసీల మేర అదనపు నీటిని వాడుకున్న దృష్ట్యా చుక్క నీరు ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.
కృష్ణా డెల్టాకు సైతం 18 టీఎంసీల మేర నీటిని అదనంగా వాడుకున్న దృష్ట్యా డెల్టాకు కూడా నీరిచ్చే పరిస్థితి లేదనే నిశ్చయానికి వచ్చింది. అయితే తమ సాగు అవసరాల నిమిత్తం ఏపీ ప్రభుత్వపరంగా లిఖితపూర్వకంగా అర్జీ పెట్టుకుంటే మాత్రం ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం చేసి నీటిని వదిలే అవకాశాన్ని పరిశీలిస్తామని ఏపీకి తెలియజేయాలని నిర్ణయించింది. కృష్ణా జలాల వివాదం, సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల తదితర అంశాలపై బుధవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్‌రావు అధ్యక్షతన సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. దీనికి ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీ, ఈఎన్‌సీ మురళీధర్, సాగర్ సీఈ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు కృష్ణా బేసిన్‌లో లభ్యత జలాలు, ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు, జరిగిన వినియోగం, ప్రస్తుత లభ్యత జలాలపై చర్చించారు. మొత్తంగా లభ్యమైన 552 టీఎంసీల నీటిలో ఏపీ 322 టీఎంసీలు, తెలంగాణకు 239.5 టీఎంసీల మేర నీటి వాటాలు ఉండగా ఏపీ ఇప్పటికే అదనంగా 42 టీఎంసీలు వాడుకుందని అధికారులు మంత్రికి తెలిపారు. కుడి కాల్వకు 132 టీఎంసీల మేర నీటి కేటాయింపులుండగా 138 టీఎంసీల మేర వాడుకున్నారని, కృష్ణా డెల్టాలో సైతం 152 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉండగా, 170 టీఎంసీలను వాడుకున్నారని అధికారులు వివరించినట్లు సమాచారం.
తెలంగాణ తన వాటా 239.5 టీఎంసీల నీటిలో కేవలం 137 టీఎంసీల మేర వాడుకుందని, మరో 102 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉందని, మొత్తంగా 51 టీఎంసీలు పూర్తిగా తెలంగాణకే దక్కుతాయని వివరించినట్లు తెలిసింది. వాటాకు మించి వాడుకున్నందున ఏపీకి కుడికాల్వ కింద నీరివ్వరాదని స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఏపీ తన అవసరాలకోసం అర్జీ పెట్టుకుంటే కొంత నీటిని విడుదల చేసేందుకు ను పరిశీలిద్దామని నిర్ణయించినట్లు సమాచారం.
కుడి కాల్వకు నీటి నిలిపివేత
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటి విడుదలను బుధవారం నిలిపివేశారు. ఈ కాల్వపై ఉన్న విద్యుదుత్పాదన కేంద్రానికి నీరందకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజులుగా కేంద్రంలోని 2 టర్బైన్ల ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
కేటాయింపు కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని, వాడకాన్ని 3,000 క్యూసెక్కులకు తగ్గించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వులను కుడికాల్వ అధికారులకు, జెన్‌కో ఇంజనీర్లకు సాగర్‌డ్యామ్ ఎస్‌ఈ విజయభాస్కర్‌రావు ఫిబ్రవరి 3న అందజేశారు. అయినా వారు పట్టించుకోకుండా 4,000 క్యూసెక్కుల విడుదలను కొనసాగించారు. దీంతో జలాశయంలో బుధవారం నీటి నిల్వలు 532.8 అడుగులకు తగ్గి విద్యుదుత్పాదన కేంద్రంలోని అంతరాయం ఏర్పడి కుడికాల్వకు వెళ్లే నీరు నిలిచిపోయింది. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.