సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గురువారం జరిగిన రైలు ప్రమాదం కాపలా లేని రైల్వే క్రాసిం గుల వద్ద భద్రతను మరోమారు తెరమీదకు తెచ్చిం ది. గతంలో జిల్లాలోనూ కాపలా లేని రైల్వే క్రాసిం గుల వద్ద జరిగిన ఘోర ప్రమాదాలను జిల్లా ప్రజానీకం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. జిల్లాలో సుమారు 200 కిలో మీటర్లు రైలుమార్గం ఉండగా నేటికీ చాలాచోట్ల కాపలా లేని రైల్వే క్రాసింగులు నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జిల్లాలో తిమ్మాపూర్ మొదలుకుని ఆలంపూర్ వరకు 191కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. ఈ మార్గంలో రోజూ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ తదితర 54 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
సుమారు అంతే సంఖ్యలో సరుకు రవాణా రైళ్లు (గూడ్సు) జిల్లా మీదుగా పరుగులు తీస్తున్నాయి. రైల్వే అధికారుల లెక్కల ప్రకారం మొత్తం 101 రైల్వే క్రాసింగులుండగా వీటిలో 60చోట్ల మాత్రమే కాపలా వుంది. మరో 41ప్రదేశాల్లో కాపలా లేని రైల్వే క్రాసింగులున్నాయి. సమీప గ్రామాల ప్రజలు ఈ క్రాసింగుల మీదుగా ప్రతిరోజూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. గతంలో జిల్లాలో కాపలా లేని రైల్వే క్రాసింగుల వద్ద ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. 2011లో దేవరకద్ర సమీపంలోని పుట్టపల్లి కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో హడావుడి చేసిన రైల్వే అధికారులు నేటికీ పుట్టపల్లి వద్ద కాపలా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. కాపలా ఉండే గేట్ల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకొని పట్టాల మీదుగా రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. అప్పన్నపల్లి, గద్వాల, జడ్చర్ల, దేవరకద్ర రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్డ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిధులు కూడా మంజూరు చేశారు. అయితే రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టిన అప్పన్నపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగి ఇటీవలే ప్రారంభమైంది. మిగతా మూడు బ్రిడ్జిల నిర్మాణం పనులు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు.
నిత్యం ప్రాణగండమే!
గ్రామీణ ప్రాంతాల్లోనే కాపలా లేని రైల్వే క్రాసింగులు అధికంగా ఉండటంతో ప్రాణాలు అరచేత పట్టుకుని పట్టాలు దాటుతున్నారు. ట్రాక్టర్లు, ఆటోలు హెచ్చరికలు లేకుండానే వెళ్తుండడంతో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. నిర్ణీత ఎత్తులో సబ్‌వేలు, మళ్లింపు దారులు నిర్మించాల్సి ఉన్నా శ్రద్ధ చూపడం లేదు. కాపలా లేని రైల్వే క్రాసింగులు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైల్వే శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
క్రాసింగుల వద్ద జరిగిన ప్రమాదాలు
1994 మే 5న గొల్లపల్లి - బాలానగర్ స్టేషన్ల నడుమ రంగారెడ్డిగూడ సమీపంలో కాపలా లేని రైల్వే క్రాసింగు వద్ద జీపును తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు.
2003 జనవరి 9న దేవరకద్ర- కౌకుంట్ల మార్గంలో డోకూరు వద్ద ట్రాక్ దాటుతున్న ఆటోను కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు ఇంజిన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారు.
2010 ఫిబ్రవరి 13న కోడూరు వద్ద గుంటూరు- సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు కారును ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు.
2011 ఫిబ్రవరి 3న దేవరకద్ర సమీపంలోని పుట్టపల్లి కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఆటోను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఏదీ కాపలా ?
Published Fri, Jul 25 2014 3:18 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement