ఎన్‌జీటీ ఉత్తర్వులపై స్టే కుదరదు
► హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
►కోరం లేకుండా ‘పాలమూరు’పై ఉత్తర్వులు సబబో కాదో తేలుస్తాం
హైదరాబాద్: పాలమూరు –రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో చట్ట ఉల్లంఘనల ఆరోపణలపై వాస్తవాలు తెలు సుకునేందుకు నిపుణుల కమిటీని నియమిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తుతానికి నిలిపేసే (స్టే) ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఎక్స్‌పర్ట్ సభ్యుడు లేకుండానే ఎన్‌జీటీ ఈ ఉత్తర్వులు జారీ చేయడం చట్ట విరుద్ధమన్న ప్రభుత్వ వాదనపై ముందుగా తేలుస్తామని స్పష్టం చేసింది.
కోరం లేకుండా ఉత్తర్వులు జారీ చేయడం చట్ట విరుద్ధమని తేలితే అప్పుడు తప్పక తగిన ఆదేశాలు జారీ చేస్తామంది. ఈ కేసులో ప్రతివాదులైన ఫిర్యాదుదారు హైదరాబాద్ వాసి హర్షవర్ధన్‌తోపాటు కేంద్ర అటవీ పర్యా వరణశాఖ కార్యదర్శి, ఎన్‌జీటీ రిజిస్ట్రార్ తదితరుల వాదనలను తొలుత వింటామం టూ వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయ మూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్త ర్వులు జారీ చేసింది.
సందేహాల నివృత్తికి కమిషన్ల ఏర్పాటు సహజమే
అంతకుముందు వాదనల సంద ర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి, నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్ జన రల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ కోరం లేకుండానే ఎన్‌జీటీ ఉత్తర్వు లివ్వడం చట్ట విరుద్ధమన్నారు.
ఈ కేసులో ఇదే ప్రధానమన్నారు. చట్ట ప్రకారం వంద కమిటీలు వేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. తాము కేవలం తాగునీటి ప్రాజెక్టు పనులనే చేపడతామని హైకోర్టుతోపాటు ఎన్‌జీటీకి హామీ ఇచ్చినా ఎన్‌జీటీ స్వతంత్ర కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ పర్యావరణ అంశాల్లో సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇటు వంటి చర్యలు తీసుకోవడం సహజమనంది. ప్రాజెక్టు పనులను ఆపాలని ఎన్‌జీటీ ఎక్కడా చెప్పలేదని గుర్తుచేసింది. కోరం లేకుండా ఎన్‌జీటీ ఈ ఉత్తర్వులివ్వడం సరైందా కాదా అనే విషయాన్ని ముందుగా తేలుస్తామంది.