
అసంపూర్తిగా మండల సమాఖ్య భవనం
సాక్షి, బీబీనగర్ : మండల కేంద్రంలోని మహిళా సంఘాల సౌలభ్యం కోసం నిర్మించిన మండల సమాఖ్య భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భవనం కాస్త నిరుపయోగంగా మారింది. పోచంపల్లి చౌరస్తా సమీపంలో మండల సమాఖ్య భవన నిర్మాణానికి 2011లో బీఆర్‌జీఎఫ్ నిధుల నుంచి రూ.11లక్షలు మంజూరయ్యాయి. దీంతోఅప్పటి జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ భవన నిర్మాణం చివరి దశలో ఉండగా నిధులు విడుదల కాకపోవడంతో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయి భవనం అసంపూర్తిగానే మిగిలిపోయింది.
స్త్రీ శక్తి భవనం నిర్మించడంతో..
మండల సమాఖ్య భవనం నిర్మాణం జరుగుతున్న సమయంలో స్త్రీ శక్తి భవనం మంజూరైంది. దీంతో ఈ భవనం నిర్లక్ష్యానికి గురికాగా స్త్రీ శక్తి భవనం నిర్మాణ పూర్తి చేశారు. దీంతో మండల మహిళా సమాఖ్య సంఘాలు ఈ భవనాన్ని వినియోగిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న మండల సమాఖ్య భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారి బూత్ బంగ్లాగా దర్శనమిస్తున్న భవనాన్ని మరో ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.
భవన నిర్మాణాన్నిపూర్తిచేయాలి
మండల సమాఖ్య భవన నిర్మాణాన్ని నిలిపివేయడంతో భవనం అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించాలని కోరుతున్నాం.
– బెండ ప్రవీణ్, బీబీనగర్