
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా కళాకారులపై లైంగిక వేధింపులు–దోపిడీలకు సంబంధించి చట్టంలో వచ్చిన మార్పుల గురించి, వాటి అమలు తీరు గురించి తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. లైంగిక వేధింపులు–దోపిడీల ఆరోపణలపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సామాజిక ఉద్యమకారిణి సంధ్యారాణి, మహిళా హక్కులపై పనిచేస్తున్న మరో ఆరుగురు ఉద్యమకారులు సంయుక్తంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రతివాదులైన రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళాశిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్, తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, కార్మిక శాఖ కమిషనర్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపించారు.‘తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఒక కళాకారిణి రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చింది. వీటిపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతివాదులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది’అని అన్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు కమిటీ లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ లైంగిక వేధింపుల నివారణకు చట్టాలు ఏం చెబుతున్నాయో.. వాటి అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో న్యాయ సేవాధికార సంస్థ సేవల్ని వినియోగించుకోవాలని హోం శాఖను ఆదేశించింది. సుమోటోగా ఆ సంస్థ సభ్యకార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. తెలంగాణ మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నిం చింది. ఇలాంటి ఆరోపణలపై అంతర్గత కమిటీలు ఇతర చోట్లా లేవని కోర్టు అభిప్రాయపడింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment