వచ్చే ఏడాదే మన ఎయిమ్స్‌  | Notification for MBBS admissions for 2019-20 | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాదే మన ఎయిమ్స్‌ 

Published Tue, Dec 11 2018 1:59 AM | Last Updated on Tue, Dec 11 2018 1:59 AM

Notification for MBBS admissions for 2019-20 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏర్పాటు చేయబోయే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 14 ఎయిమ్స్‌లలో ఒకేసారి ప్రవేశాలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బీబీనగర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర బృందం అక్కడికి వచ్చి నిమ్స్‌ భవనాలు, అదనపు స్థలాలను పరిశీలించింది. ఎంబీబీఎస్‌లో ప్రవేశాల్లో భాగంగా తెలంగాణ ఎయిమ్స్‌కు కూడా ప్రవేశాలు జరిపేలా నోటిఫికేషన్‌ ఇవ్వడంతో ఎయిమ్స్‌ ఏర్పాటు వచ్చే ఏడాదే ఉంటుందని స్పష్టమైంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి, బఠిండా, భోపాల్, భువనేశ్వర్, గోరఖ్‌పూర్, దేవ్‌గఢ్, జోధ్‌పూర్, కల్యాణి, నాగ్‌పూర్, పట్నా, రాయ్‌పూర్, రాయ్‌బరేలీ, రిషికేశ్‌ల్లో ఉన్న ఎయిమ్స్‌ల్లోనూ ప్రవేశాలు జరుపుతామని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. 

మే 25, 26 తేదీల్లో ఎంట్రన్స్‌ టెస్ట్‌ 
అన్ని ఎయిమ్స్‌ల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. జనవరి మూడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది మే 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాల వివరాలు ఎయిమ్స్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇంటర్మీడియెట్‌ బైపీసీ విద్యార్థులు ఎంబీబీఎస్‌ కోర్సుకు అర్హులు. అలాగే ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాలంటే ప్రవేశ పరీక్షలో సరైన ర్యాంకు రావడంతోపాటు ఇంటర్మీడియెట్‌లోని ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం, వికలాంగులు 45 శాతం మార్కులు సాధించి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

ఎయిమ్స్‌ ఏర్పాటుకు మొదలైన సన్నాహాలు 
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎయిమ్స్‌ ద్వారా ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు చేపట్టాలని తెలంగాణ ప్రభు త్వం అక్టోబర్‌లో కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి.. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సూడాన్‌కు అప్పట్లో లేఖ రాశారు. నిమ్స్‌ భవనాలను, అక్కడి భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎయిమ్స్‌ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకోవాలని కోరారు. శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత భవనంలో ఓపీ సేవలను ప్రారంభించాలని విన్నవించారు. ఇచ్చిన స్థలంలో భవనాల నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. బీబీనగర్‌లో ప్రస్తుతమున్న 150 ఎకరాల ప్రాంగణం, ఇంకా అవసరమైన మరో 50 ఎకరాల స్థలాన్ని అంతకుముందు కేంద్ర బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసింది. స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు, ఇతరత్రా సమాచారాన్ని కేంద్రం తీసుకుంది. అంతేగాక ఎయిమ్స్‌ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement