9490617444 నెంబరు వాట్సప్తో నేరాలకు చెక్
నగర ప్రజల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాట్సప్ను కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. నేరాలకు సంబంధించిన సమాచారంగానీ, ఫొటోలుగానీ, వీడియోలుగానీ పంపించాలనుకుంటున్నవారు ప్రత్యేకంగా కేటాయించిన వాట్సప్ నంబర్ 9490617444 ద్వారా పంపించవచ్చని తెలిపారు. దీంతో పోలీసులు సత్వర సేవలు అందిస్తారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
అలాగే ఇక నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి లేదా అంతకంటే ఎక్కువ హోదా ఉన్న ట్రాఫిక్ పోలీసులు మాత్రమే వాహన వినియోగదారులకు ఫైన్ విధిస్తారన్నారు. ఎస్ఐ కన్నా కింది ర్యాంకు పోలీసులైతే నియమ నిబంధనలు పాటించిన వాహనాలను ఫొటోలు మాత్రమే తీయాలని, ఏదైనా వివాదానికి దారి తీస్తే ఎస్ఐ వచ్చేంతవరకు ఆ వాహనాన్ని పక్కకు ఉంచాలని చెప్పారు. అన్ని పత్రాలు ఉన్నప్పటికీ తప్పుడుగా ఫైన్ వేస్తే రశీదును స్వీకరించి వసూలు చేసిన పోలీసు అధికారిపై ఫిర్యాదు చేయొచ్చని, లేదా 9010203626 నెంబర్కు సంప్రదించవచ్చని చెప్పారు.