
బోనంతో సినీనటి పూనమ్ కౌర్
లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు జల్లి కడువా, 4 గంటలకు బలిహరణ పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన బోనాల సమర్పణ సాయంత్రం వరకు కొనసాగింది. పాతబస్తీ జాతరను తలపించింది. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంట గంటకు క్యూలైన్ పెరిగిపోవడంతో దర్శనం కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది.రాష్ట్ర మంత్రులు సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పలువురు రాజయకీయ ప్రముఖులు సైతం మొక్కులుచెల్లించుకున్నారు. ఉదయం 10 గంటల అనంతరం వర్షం మొదలైనా సరే లైన్‌లోనే ఉండి బోనాలు సమర్పించారు. ఆద్యంతం యువకులు పోతురాజు వేషధారణలో అలరించారు. శివసత్తుల చిందులతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జోగినులు మెట్ల బోనాలతో నృత్యాలు చేస్తూ ముందుకు కదిలారు.
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజామున మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అనంతరం భక్తులను దర్శనం కోసం అనుమతించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఎంపీ విజయశాంతి, పీవీ సింధు బంగారు బోనం సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినీ నటుడు సుమన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహాడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతారావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ కార్యదర్శి నర్సయ్య గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు ప్రభాకర్ రావు, రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బండారు శ్రీకాంత్, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు తిరుపతి శ్రీనివాసారావు, బీసీ కమిషన్ చైర్మన్¯ బి.ఎస్.రాములు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, హైదరాబాద్ ఆర్డీఓ డి.శ్రీనివాస్ రెడ్డి, బండ్లగూడ తహసీల్దార్ షేక్ ఫర్హీన్, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయ కమిటీ ఈఓ మహేందర్ రెడ్డి అమ్మవారి ఆశీస్సులందుకున్నారు. ఉత్సవాల సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపు కమిషనరన్లు అనిల్ కుమార్, శిఖా గోయెల్, దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిషోర్ ఝా, ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్ ఎం.ఎ.రషీద్, ఛత్రినాక, శాలిబండల ఇన్‌స్పెక్టర్లు ఆర్.విద్యాసాగర్ రెడ్డి, పి.శ్రీనివాస్‌లు బందోబస్తును పర్యవేక్షించారు. భక్తుల ఏర్పాట్లలో ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్‌రావు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
నీటి కొరత పోవాలని..
దేశ ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నా. ప్రస్తుతం మన దేశంలో నీటి కొరత కలవరానికి గురి చేస్తోంది. కేవలం 25 శాతం చెరువుల్లోనే నీరుంది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చెరువులు, నదులు, ప్రాజెక్ట్‌ల్లోకి నీరు వచ్చేలా వర్షాలు కురవాలని వేడుకున్నా. – జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి
సీఎం ప్రత్యేక చొరవతోనే..
బోనాల పండుగ కేవలం తెలంగాణకే ప్రత్యేకం. సీఎం కేసీఆర్ ఈ వేడుకకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆలయాల వద్ద అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించడం సంతోషకరం. బోనాల ఉత్సవాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి చూసుకున్నారు. – మహమూద్ అలీ, హోంమంత్రి
మన పండుగ విశ్వవ్యాప్తం
మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బోనాలు. ఇప్పుడిప్పుడే విశ్వవ్యాప్తమవుతోంది. రాష్ట్రం సస్యశ్యామలం కావాలి. భక్తుల కోసం హెల్త్ క్యాంప్‌లు, మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశాం. సోమవారం ఊరేగింపు సాయంత్రం 4 గంటలకే ప్రారంభించాలి. – తలసాని శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర మంత్రి
బంగారు తెలంగాణ సాకారం
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కావాలని అమ్మవారిని కోరుకున్నా. బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తూ అన్ని సదుపాయాలు కల్పించాం. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నా.– ఇంద్ర కరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి
దాడులు జరగరాదని..
అమ్మవారు మాంగల్యాన్ని కాపాడుతుంది. మహిళలపై దాడులు జరగరాదని, తెలంగాణలో బలవన్మరణాలు చోటుకోరాదని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మను కోరుకున్నా. ప్రతి ఒక్కరు దేశ భక్తి, దైవ భక్తిని అలవర్చుకోవాలి. అప్పుడే పురాతన సంప్రదాయాలను కాపాడినవారమవుతాం.– బండారు దత్తాత్రేయ,మాజీ కేంద్ర మంత్రి
నేడు భవిష్యవాణి
చాంద్రాయణగుట్ట: బోనాల జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రంగం (భవిష్యవాణి) లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం తరఫున సోమవారం అనురాధ వినిపించనున్నారు. గత 35 ఏళ్లుగా భవిష్యవాణి వినిపించిన సుశీల భర్త మృతి చెందిన నేపథ్యంలో 2015 నుంచి ఆమె కుమార్తె అనురాధ భవిష్యవాణి వినిపిస్తోంది. జగద్గిరిగుట్టలో నివాసం ఉండే అనురాధను కూడా చిన్నతనం నుంచే అమ్మవారు ఆవహిస్తారు. తన తల్లి ఆదేశానుసారం ఆమె భవిష్యవాణి వినిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment