పెద్ద అడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో ఘటన
పింఛన్ కోసం ఆ వృద్ధ దంపతులు కాళ్లరిగేలా తిరిగారు.. కనిపిం చిన వారినల్లా ప్రాథేయపడ్డారు.. అయినా ఫలితం శూన్యం.. అధికారుల ఈసడింపులూ చవిచూశారు..అయినా ప్రయత్నం మానలేదు..గురువారం కూడా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లారు.. అక్కడ కనిపించిన వారందరినీ అడిగారు.. ఇక ఫలితం లేదనుకున్నాడో.. బతకడం వ్యర్ధమనుకున్నాడో.. తెలియదుకానీ ఇంటికెళ్లి ఉరిపోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. -పెద్ద అడిశర్లపల్లి
పింఛన్ మంజూరు కాలేదనే బెంగతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్ద అడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో శుక్రవారం వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పడాల పెద్దులమ్మ వికలాంగురాలు. వైకల్యం శాతం తక్కువగా ఉందన్న కారణంతో ఆసరా పింఛన్ ఇవ్వలేదు. ఆమె భర్త పడాల రాములు(70)కు కూడా పింఛన్ మంజూరు కాలేదు. ఇద్దరు దంపతులు పింఛన్ కోసం ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది.
గురువారం కార్యాలయానికి వచ్చిన రాములు కనిపించిన వారినల్లా పింఛన్ కొరకు ప్రాథేయపడ్డాడు.సరైన సమాధానం చెప్పేవారు లేకపోవడంతో సాయంత్రం గ్రామానికి చేరుకుని కనిపించిన వారితో తనకు పింఛన్ రాని విషయాన్ని ఆవేదనగా వెళ్లగక్కాడు. చీకటి పడుతుండగా ఇంటికి చేరుకుని తలుపునకు వస్త్రంతో ఉరేవేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి చూడగా అప్పటికే మృతిచెందాడు.
గురువారం రాములు ఎంపీడీఓ వి.సరస్వతిని కలిసి పింఛన్ గురించి అడగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని గుడిపల్లి ఎంపీటీసీ వి.చంద్రారెడ్డి ఆరోపించారు. ‘‘రాములుకు తక్కువ వయస్సు ఉండడంతోనే పింఛన్ మంజూరు కాలేదని, ఏ సంఘటన జరిగినా పింఛన్ కారణంగా చెప్పడం సరికాదని’’ ఎంపీడీఓ సరస్వతి అన్నారు. రాములు దరఖాస్తును పరిశీలిస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని ఆమె పేర్కొన్నారు.
పింఛన్ మంజూరు కాలేదని..మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
Published Sat, Feb 21 2015 3:16 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement