నగరంలో పాతనోట్ల మార్పిడి ముఠా ఆటకట్టు
Published Thu, Mar 23 2017 8:03 PM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
బన్సీలాల్‌పేట్(హైదరాబాద్‌సిటీ): పాతనోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా రూ. 500, రూ. 1,000 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం డీసీపీ లింబారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి క్రిష్ణచైతన్యరెడ్డి ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్నాడు.
వాటి నుంచి గట్టేక్కేందుకు తన స్నేహితుడు సురేష్‌బాబుతో కలిసి పాతనోట్ల మార్పిడికి ఒడిగట్టాడు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి తన వద్ద ఉన్న పాతనోట్లను మార్చుకునేందుకు నగరానికి రాగా, రామంతాపుర్‌కు చెందిన జగదీష్, బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు మధ్యవర్తులుగా పాతనోట్ల మార్పిడికి రంగం సిద్ధం చేశారు. అంబర్‌పేట్ పోస్టాఫీస్ వద్ద కారులో నోట్లు మార్పిడికి పాల్పడుతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఆరు సెల్‌ఫోన్లు, కారు, రూ. 48.66 లక్షల పాతనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించారు.
Advertisement
Advertisement