పరిశ్రమలకు వారానికి ఒక రోజే పవర్‌హాలిడే!
Published Wed, Oct 22 2014 1:49 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలకు విధించిన రెండురోజుల విద్యుత్ కోతను నవంబర్ మొదటి వారం నుంచి ఒకరోజుకు కుదించేందుకు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారకరామారావు హామీ ఇచ్చినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సంఘం తెలిపింది. మంగళవారం సచివాలయంలో పారిశ్రామికవేత్తల సంఘంతోపాటు సీఐఐ, ఫ్యాప్సీ, ఫార్గింగ్ అసోసియేషన్, ఏపీపీఎంఏ, మైక్రో ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2రోజుల పవర్ హాలిడే వల్ల ఇబ్బందులు తలెత్తుతుందని తెలియజేశారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున విద్యుత్ కోత విషయంలో పరిశ్రమలు కొంతమేర సహకరించాలని మంత్రి సూచించినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను 8 రూపాయలకు కొనుగోలుచేస్తూ, వ్యవసాయానికి, పరిశ్రమలకు సర్దుబాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 54 శాతం విద్యుత్‌ను ఇవ్వకుండా చంద్రబాబు ట్రిబ్యునల్‌కు వెళ్లడం ద్రోహమేనని, తెలంగాణకు కేంద్రం అదనంగా విద్యుత్ ఇచ్చి ఏపీ ప్రభుత్వ తీరును అడ్డుకోవాలన్నారు. విద్యుత్ సంక్షోభాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. మంత్రిని కలిసిన వారిలో కె. సుధీర్‌రెడ్డి, ఎం.గోపాల్‌రావు, సుధాకర్ తదితరులున్నారు.
Advertisement