సాక్షి, హైదరాబాద్: రేషన్‌కార్డు, ఇళ్లు, పెన్షన్, స్కాలర్‌షిప్ ఇలా ఏ సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందాలన్నా మీ దగ్గర ఓ కార్డు ఉండాలి. ఒకరకంగా సామాజికభద్రత కార్డులుగా పరిగణించే వీటి జారీ విధివిధానాలపై అధికారయంత్రాంగం స్పష్టతనిస్తోంది. ఈ కార్డులకు అర్హులెవరో తేల్చడానికి ఆగస్టు రెండోవారంలో ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా పేదల స్థితిగతులపై సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించనున్నారు. దీనికి మొత్తం ప్రభుత్వవ్యవస్థనంతా రంగంలోకి దింపనున్నారు. సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, నకిలీలు లేకుండా చేసేందుకు ఆధార్‌తో అనుసంధా నం చేస్తూ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించాలని చెప్పారు. పౌరసత్వకార్డులు (పాసుపోర్టుల తరహాలో సిటిజెన్ కార్డులు) జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సీఎంవో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక రాష్ట్రం పౌరసత్వకార్డులు ఇవ్వడమేమిటనే విమర్శలు రావడంతో... వాటిపై వివరణ ఇస్తూ, అవి సామాజిక భద్రతకు ఉద్దేశించిన కార్డులని ఓ ఉన్నతాధికారి తెలిపారు. భవిష్యత్తులో ఏ సంక్షేమపథకానికైనా ఈ కార్డులనే ఆధారంగా చేసుకుంటారు. ‘ఆగస్టు రెండోవారంలో ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపుతాం. ప్రతిఇల్లూ సర్వే చేస్తాం. పేదల స్థితిగతులను రికార్డు చేస్తాం. వాటి ఆధారంగానే కార్డులను జారీ చేస్తాం. ఈ ప్రక్రియపై ఎమ్మార్వోలతో, కలెక్టర్లతో ఆగస్టు ఒకటిన సమావేశం నిర్వహిస్తాం’ అని వివరిం చారు. గతంలో నిర్వహించిన మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే మాదిరిగానే ఇది ఉంటుందని ఆయన చెప్పారు. ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోవాలన్న అంశంపై అధికారులు ఓ నిర్ణీత ఫార్మాట్ రూపొందించే పనిలో పడ్డారు. 2011 జనాభా లెక్కల సమయంలో కొన్ని అంశాలు వెల్లడైనప్పటికీ.. ప్రభుత్వం తాజాగా సర్వే చేయాలని నిర్ణయించింది.
అన్ని సంక్షేమ పథకాలకూ ఒకేకార్డు
Published Sat, Jul 26 2014 1:00 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
Advertisement