సాక్షి, ఖమ్మం : అవకాశం ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనుకోసుకోవాలని ఎవరికి ఉండదు.. అలాంటి పోస్టు దొరికితే వదులుకునే దురదృష్టవంతులు ఎవరుంటారు.. అందుకే ఇప్పుడు చాలా మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల చూపు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌పై పడింది.. నాలుగు రాళ్లు సమకూరే ప్రాంతం కావడంతో ఆ స్టేషన్‌లో పోస్ట్ ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు ఆ శాఖలో నెలకొంది. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన స్టేషన్లలో ఇది ఒకటి కావడం గమనార్హం. జిల్లాలో అన్ని సర్కిళ్లలో బదిలీలు జరిగినా త్రీటౌన్‌కు సీఐని నియమించకపోవడంతో ఆ శాఖలో ఆసక్తి నెలకొంది.
ఖమ్మం నగరంలో ఎంతో కీలకమైన త్రీటౌన్ సీఐ పోస్ట్ కోసం రోజురోజుకు ఆశావాహుల సంఖ్య పెరిగి పోతోంది. ఇటీవల బదిలీలో అక్కడ పనిచేస్తున్న సీఐ షూకూర్ బదిలీపై మణుగూరు వెళ్లిన విషయం విదితమే. ఈ స్టేషన్‌కు పోలీస్ ఉన్నతాధికారులు ఎవరికీ కేటాయించకపోవటంతో పలవురు ప్రజాప్రతినిధుల ద్వారా ఈ పోస్టును దక్కివంచుకోవడానికి కొందరు సీఐలు ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నగరంలో రెండు పోలీస్ స్టేషన్‌లలో ఎస్‌హెచ్‌వోలుగా పనిచేస్తున్న ఇద్దరు, గతంలో ఖమ్మంలో ఎస్‌హెచ్‌ఓలుగా పనిచేసి ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు సీఐలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..
త్రీటౌన్‌కు ఎందుకంత క్రేజ్...
నగరంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో పోలీస్‌లకు ఆదాయ వనరులుగా చెప్పే పోలీస్‌స్టేషన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. మొదటి నుంచి ఈ పోలీస్ స్టేషన్‌కు క్రేజ్ ఎక్కువే. చాలా మంది పోలీస్ అధికారులు ఒకసారి ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పనిచేస్తే చాలు జీవితంలో అన్నివిధాలుగా స్థిరపడినట్లే అని చెబుతూ ఉంటారు. గతంలో త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు అధికారిగా రావాలంటే పోలీస్ ఉన్నతాధికారుల వద్ద మంచి పేరు ఉండాలి. ప్రస్తుతం పరిస్థితి మారిపోవటంతో ప్రజాప్రతినిధుల చేతిలోకి వెళ్లటంతో ఖాళీ అయిన ఈ పోలీస్ స్టేషన్ కుర్చీకోసం పోటీపడేవారు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం త్రీటౌన్ ప్రాంతంలో ఉన్న గాంధీచౌక్, వ్యవసాయ మార్కెట్ ఖమ్మం జిల్లాకు గుండెకాయ వంటివని చెప్పవచ్చు.
నిత్యం ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు నడుస్తూ ఉంటాయి. దీనికి తోడు త్రీటౌన్ ప్రాంతం అంతా ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నగరంలో వన్‌టౌన్, టూటౌన్, ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల మాదరిగా నిత్యం ధర్నాలు, ఘర్షణలు తక్కువ. ఈ మూడు పోలీస్ స్టేషన్లతో పోలిస్తే అసాంఘిక కార్యకలాపాలు సైతం తక్కువ అని చెప్పవచ్చు. అందువల్లనే ఉమ్మడి జిల్లాలోనే ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు అతి త్వరలో భర్తీకానున్న ఈ పోలీస్ స్టేషన్ కుర్చీ ఎవరికి దక్కనుందో ప్రజాప్రతినిధులు ఎవరిని కరుణించనున్నారో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment