మాట్లాడుతున్న సీపీ అంజనీకుమార్
సాక్షి, సిటీబ్యూరో: ఈ కొత్త ఏడాదిలో సరికొత్త పోలీసింగ్‌ను అమలులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. ఇందులో సబ్–ఇన్‌స్పెక్టర్ల (ఎస్సై) పాత్ర అత్యంత కీలకమన్నారు. ఈ ఏడాదికి సంబంధించి నగర పోలీసు ప్రాధాన్యాలను సిబ్బందికి తెలియజెప్పేందుకు కొత్వాల్ ‘సిటీ పోలీసు రోడ్ మ్యాప్ ఫర్ 2019’ పేరుతో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరాయ భవన్‌లో ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి సిటీ పోలీసు విభాగానికి చెందిన ఎస్సై ఆ పైస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇందులో కొత్వాల్ జోన్ల వారిగా సమీక్ష చేసి ఈ ఏడాదికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘కొత్తగా అమలులోకి తీసుకురానున్న చర్యలు ప్రజలతో మమేకమయ్యేలా, మరింత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేలా ఉంటాయి. ఇందులో ఎస్సై స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకం. అనునిత్యం ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండేది వీరే. ఈ ఏడాది ప్రజల అవసరాన్ని బట్టి పోలీసుల చర్యలు ఉంటాయి. ప్రతి జోన్‌కు వేర్వేరుగా ప్రాధాన్యాలు నిర్ధారిస్తున్నాం. నగర పోలీసు రానున్న రోజుల్లో మరింత యూజర్, సిటిజన్, కమ్యూనిటీ ఫ్రెండ్లీ కావాలన్నదే మా లక్ష్యం. సిటీ పోలీసు విభాగాన్ని ప్రొఫెషనల్‌గా దేశంలో నం.1గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
పోలీసు విభాగం ఆలోచనలు ప్రతి ఒక్క అధికారికీ చేరాలనే ఉద్దేశంతోనే ఈ ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించాం. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య మండలాలకు చెందిన ఎస్సై నుంచి పై స్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు. జోన్ల వారీగా బలాలు, బలహీనతలను గుర్తించి కూలంకషంగా చర్చిస్తున్నాం. 2019కి సంబంధించి ప్రాధాన్యాలు, బలహీనతలను బలాలుగా మార్చుకునే మార్గాలపై చర్చించాం. ఈ నేపథ్యంలో సిటీ పోలీసు విజన్. స్ట్రాటజీ నిర్ధారిస్తున్నాం. సిటీలోని ప్రతి ఠాణాకు, జోన్‌కు కొన్ని ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కో జోన్‌కు ఒక్కో రకమైన అవసరాలు, ప్రాధాన్యాలు కనిపిస్తాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాధాన్యాలను నిర్ధారిస్తున్నాం. ఈ ఏడాదిలో ఎస్సైలను ఉత్తమ నాయకుడిగా తీర్చిదిద్దడానికి కీలక ప్రాధాన్యం ఇస్తున్నాం. సిటీ పోలీసు వింగ్‌లో 550 మంది డైరెక్ట్ రిక్రూట్ సబ్–ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. వీరంతా పోలీసు విభాగానికి బలం. ఈ అధికారులకు అన్ని కోణాల్లోనూ సమగ్ర తర్ఫీదు ఇస్తాం.
నెల రోజుల వ్యవధిలో మొదటి విడత శిక్షణ పూర్తి చేస్తాం. 2018లో నగరంలో స్నాచింగ్స్ 30 శాతం తగ్గాయి. వీటిని మరింత తగ్గించేందుకు కృషి చేస్తాం. బయటి గ్యాంగ్‌లు నగరంలో అడుగుపెట్టకుండా నిరోధించేందుకు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అధికారులతో టచ్‌లో ఉంటున్నాం. సాధ్యమైనంత వరకు ఏ గ్యాంగ్‌ను నగరంలోని రానీయం. జరిగిన ప్రతి కేసునూ వారం లోనే కొలిక్కి తీసుకువస్తాం. సైబర్ నేరాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతి మెట్రో నగరంలోనూ జరుగుతున్నాయి.. పెరుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం పెరగడమే అందుకు కారణం. సిటీ పోలీసు తరఫున ఎస్సై ఆపై స్థాయి వారికి రానున్న మూడు నెలల్లో వర్క్ షాపులు నిర్వహించి ఈ కేసుల దర్యాప్తులోనూ శిక్షణ ఇస్తాం. సీసీఎస్ ఆధీనంలో అత్యాధునిక సైబర్ ల్యాబ్ ఉంది. దీనిని ఇంకా ఆధునీకరించడంతో పాటు అందులోని సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చి ధీటుగా మారుస్తాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు ఎవరైనా చర్యలు తప్పవు. నగరంలో ప్రతి ఒక్కరి భద్రత సిటీ పోలీసుల బాధ్యత. ఆస్పత్రులతో పాటు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరుగుతోందని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేతప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే అరెస్టులు తప్పవు’ అని సీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment