
అతి వేగం.. అతి నిర్లక్ష్యం!
♦ గుంతలో పడి ద్విచక్రవాహనదారుడి మృతి
♦ మరో ఇద్దరికి తీవ్రగాయాలు..
♦ గుంత వద్ద ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయని అధికారులు
హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న భూగర్భ రహదారి (సబ్ వే) గుంతలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పడి ఒక యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి.
సోమవారం తెల్ల వారుజామున 2.30 గంటల సమయంలో హయత్‌నగర్ వైపు నుంచి ఎల్బీనగర్ సాగర్ రింగ్‌రోడ్డువైపు సీబీజెడ్ మోటారుసైకిల్ (ఏపీ 29 ఏపీ 5910)పై వెళుతున్న బడంగ్‌పేట గాంధీనగర్‌కు చెందిన యువకులు కే.రాఘవేందర్ (23), ఈ.అశోక్ (23), ఎల్.సాయికిరణ్ (22)లు చింతలకుంట చెక్‌పోస్ట్ సమీపంలో ఓపెన్ హౌజ్ బార్ ఎదురుగా నిర్మాణంలో ఉన్న సబ్ వే 20 అడుగుల గుంతలో ప్రమాదవశాత్తు వాహనంతో సహా పడిపోయారు.
దీంతో వాహనం నడుపుతున్న రాఘవేందర్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, అశోక్, సాయికిరణ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అశోక్, సాయికిరణ్‌లను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన రాఘవేందర్ ప్రైవేటు ఉద్యోగి. అతనికి వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో..
చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద సబ్ వే నిర్మాణం కోసం రోడ్డు మధ్యలో భారీగా తవ్వకాలు జరిపారు. తవ్వకాలు జరిపినమేర బారికేడ్లు ఏర్పాటుచేసి ఇరువైపులా వాహనాలు వెళ్లేలా దారిని ఏర్పాటు చేశారు. అయితే రోడ్డు మధ్యలో రాత్రివేళ పనులు జరుగుతుండడంతో వారి వాహనాలు రావడానికి కొంతమేర బారికేడ్లను తొలగించారు. అయితే, దీనికి సంబంధించి ఎటువంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రివేళ బైక్‌పై వేగంగా వచ్చిన రాఘవేందర్, అతని స్నేహితులు రోడ్డు మధ్యలో బారికేడ్ల సందు నుంచి నేరుగా వెళ్లి గుంతలో పడిపోయారు. యువకుల అతివేగం, నిర్మాణం పనుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.