
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గోదావరిఖనిలో సంక్రాంతి పండుగ పూట గురువారం కతుబోజుల సత్యం (45) రోడ్డు ప్రమాదంలో మృతిచెందన సంఘటన విషాదం నింపింది.
కోల్‌సిటీ : గోదావరిఖనిలో సంక్రాంతి పండుగ పూట గురువారం కతుబోజుల సత్యం (45) రోడ్డు ప్రమాదంలో మృతిచెందన సంఘటన విషాదం నింపింది. ట్రాఫిక్ పోలీసుల కథనం... వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇసిపేట గ్రామానికి చెందిన సత్యంకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వడ్రంగి పని చేసుకునే సత్యం బతుకుదెరువు కోసం 25 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లా మందమర్రి 3వ జోన్‌కు వలస వచ్చాడు.
సొంత ఇల్లు కూడా లేని సత్యం అతికష్టం మీద పెద్ద కూతురు అనూషకు ఈనెల 30న పెళ్లి నిర్వహించడానికి ముహుర్తం పెట్టుకున్నారు. పెళ్లి కూడా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని అత్తగారింట్లో చేయడానికి ఏర్పాట్లు చేశారు. అత్తగారింట్లో లగ్గంకోటు వెయ్యడానికి రెండు పెళ్లి పీటలను బైక్‌కు కట్టుకున్న సత్యం గురువారం గుంపులకు బయలుదేరాడు. మార్గమధ్యలో బైక్‌లో పెట్రోల్ పోయించడానికి గోదావరిఖని గంగానగర్‌లోని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు.
పెట్రోల్ పోయించుకున్న అనంతరం రాజీవ్హ్రదారి ఫ్లైఓవర్‌పైకి మూల తిరుగుతుండగా ఎదురుగా కర్రల లోడ్‌తో వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యం తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామం వరంగల్ జిల్లాలోని మొగుళ్లపల్లికి తరలించారు. పెళ్లింట విషాదం అలుముకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
తలకొరివిపెట్టిన చిన్న కూతురు...
సత్యం మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. ‘ఎంత కష్టమైనా బిడ్డ పెండ్లి చేస్తనంటివి గద సత్తెన్న.. బిడ్డ పెండ్లి చెయ్యకుంటనే పోతివా సత్తన్న..’అంటూ విల పించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. తండ్రి శవయాత్రలో చిన్న కూతురు శిరీష అగ్గిపట్టి నడుస్తుంటే ఊరంతా కన్నీరుపెట్టింది.