ఖమ్మం: ఖమ్మం జిల్లా వైరా సమీపంలో చిన్నపాక వద్ద బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేటకు చెందిన శ్రీనివాసరావు కుటుంబం కారులో పుష్కరాలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు( 45) అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్య ఉపేంద్ర, కుమారుడు శ్రీకాంత్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వైరా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.