31వ తేదీ వరకూ చేరొచ్చు
♦ ఇంజనీరింగ్ ప్రవేశాల గడువు పొడిగించిన విద్యాశాఖ
♦ 30న జేఈఈ స్పెషల్ కౌన్సెలింగ్‌కు విద్యార్థులకు అవకాశం
♦ 3న ఇంటర్నల్ స్లైడింగ్.. 4న స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో చేరే గడువును ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో 6,510 సీట్ల భర్తీకి ఈ నెల 30న స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సెంట్రల్ సీట్ అలకేషన్ అథారిటీ (సీఎస్‌ఏబీ) ప్రకటించడం.. మరోవైపు ఎంసెట్ చివరి దశ కౌన్సెలింగ్ పూర్తవడంతో ఈనెల 29లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చి కాలేజీల్లో చేరాలని సాంకేతిక విద్యా శాఖ పేర్కొనడంతో రాష్ట్ర విద్యార్థులు గందరగోళంలో పడ్డారు.
దీంతో జాతీయ విద్యా సంస్థల్లో సీట్లు పొందే అవకాశాన్ని రాష్ట్ర విద్యార్థులు కోల్పోయే అంశంపై శుక్రవారం ‘చూడాలా.. చేరాలా..?’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ వాణిప్రసాద్ స్పందించారు. అధికారులతో సమావేశమై ప్రవేశాల గడువును ఈనెల 29 నుంచి 31కి పొడిగించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థుల మొబైల్ నంబర్లకు ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెంటనే సమాచారాన్ని పంపింది. ఈ నెల 31 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చని, కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు అందజేసి చేరొచ్చని పేర్కొంది. సీట్లను రద్దు చేసుకోవాలనుకునే వారు కూడా ఈనెల 31 మధ్యాహ్నం 2 గంటల వరకు సీట్లు రద్దు చేసుకోవచ్చని ప్రకటించింది.
బ్రాంచీ మారితే..
సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరిన బ్రాంచీల్లో కాకుండా ఇతర బ్రాంచీలకు మారాలనుకుంటే ఆగస్టు 3న నిర్వహించే ఇంటర్నల్ స్లైడింగ్‌లో పాల్గొనాలని, ఇందుకు కాలేజీల్లోనే సంప్రదించాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. క్యాంపు కార్యాలయం కేటాయించిన బ్రాంచీలో కాకుండా స్లైడింగ్ ద్వారా మరో బ్రాంచీకి మారితే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని సూచించారు.
4 నుంచి 9 వరకు స్పాట్ అడ్మిషన్లు
కాలేజీల్లో మిగిలిన సీట్ల భర్తీకి వచ్చే నెల 4న యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేసి 9లోగా పూర్తి చేయాలని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాలను వచ్చే నెల 11లోగా ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలన్నారు. వాటికి సంబంధించిన హార్డ్ కాపీలు, డీడీలను 16లోగా ప్రవేశాల క్యాంపు కార్యాలయా నికి పంపించాలని సూచించారు.