జీతభత్యాలను పెంచుకునే సమయమిదా? | oppositions take on telangana government | Sakshi
Sakshi News home page

జీతభత్యాలను పెంచుకునే సమయమిదా?

Published Wed, Nov 19 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

oppositions take on telangana government

 సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
 రాష్ర్ట ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షాలు


 సాక్షి, హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రజాప్రతినిధులకు జీతభత్యాలు పెంచడం సమంజసం కాదని విపక్షాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత, మాజీ శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు జీతభత్యాలు, ఇతర సదుపాయాల గురించి చర్చించడానికి స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన సదుపాయాల కమిటీ మంగళవారం సమావేశమైంది. సభ్యుల జీతభత్యాలను రెట్టింపు చేయడాన్ని మజ్లిస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు వ్యతిరేకించారు. పెరిగిన ఖర్చులు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతభత్యాలను పెంచాలని పలువురు కోరుతున్నారని, అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్ వివరించారు. రైతాంగం సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సమయంలో బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు జీతభత్యాలను పెంచుకుంటే ఎలాంటి సంకేతాలను ఇచ్చినట్టవుతుందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ), సున్నంరాజయ్య(సీపీఎం), రవీంద్రకుమార్(సీపీఐ) ప్రశ్నించారు. హరీశ్ స్పందిస్తూ... ‘అనుదినం ప్రజల్లో ఉంటున్న వారికి రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. వచ్చీపోయే వారికి కనీసం టీ పోయడానికి కూడా ఇప్పుడున్న జీతం సరిపోవడం లేదని కొందరు సభ్యులు అంటున్నారు. జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతభత్యాలను పెంచడం ద్వారా చట్టసభలో సభ్యులుగా ఉన్నవారు పక్కదారులు, పర్సంటేజీలకు పోకుండా నిజాయితీగా పనిచేయడానికి వీలుంటుందని చాలామంది ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అవినీతికి దూరంగా ఉండాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు జీతాలను పెంచడం ద్వారా మరింత నిజాయితీతో పనిచేయడానికి వీలుంటుందని ప్రభుత్వం భావించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది’ అని వివరించారు. హరీశ్ వాదనకు అక్బరుద్దీన్ ఘాటుగా స్పందించారు. ‘మనకు ఇష్టం వచ్చినట్టు జీతాలను పెంచుకుంటూ పోతున్నాం. దీనికి ఒక విధానమంటూ లేదా? మిగతా రాష్ట్రాల్లో పాటిస్తున్న ప్రాతిపదిక ఏమిటి? వీటిపై దేశవ్యాప్తంగా అధ్యయనం చేయండి. తర్వాత వాటికి అనుగుణంగా ఇక్కడి పరిస్థితులను బట్టి జీతభత్యాలపై నిర్ణయం తీసుకుంటే బాగుం టుంది’ అని సూచించారు. మిగతా పార్టీల సభ్యులు కూడా దీనికి అంగీకరించారు. ప్రస్తుత సభ్యులతో పాటు మాజీ సభ్యులకు పెన్షన్లు, నగదురహిత వైద్యం, వైద్య చికిత్సలకు పరిమితిని పెంచాలన్న అంశాలపైనా చర్చ జరిగింది. శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, డిప్యూటీ స్పీక ర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఈటెల రాజేం దర్, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement